చాలామంది చిన్న వయసులోనే మాదకద్రవ్యాలకు బానిసలవుతున్న దుస్థితిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. మత్తు మహమ్మారి నుంచి బయటపడేసేందుకు దేశంలోని పలు ప్రాంతాల్లో... సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రత్యేక సహాయక కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. 'అవుట్రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్'గా పిలిచే ఈ కేంద్రం విజయవాడలోనూ ఏర్పాటైంది. వోడీఐసీ కేంద్రాల ద్వారా మత్తు పదార్థాల వాడకాన్ని అంచనా వేస్తారు. మాదక ద్రవ్యాలు సేవించే వారిని గుర్తించి... కౌన్సిలింగ్ ఇస్తారు. చికిత్స చేసి పునరావాసం కల్పిస్తారు.
మాదకద్రవ్యాల విక్రయించేవారు... పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇటీవలే విజయవాడలోని ఓ కళాశాలల వద్ద కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామంతో కళాశాలల యాజమాన్యాలూ అప్రమత్తమయ్యాయి. గంజాయి, హెరాయిన్ సహా... ఫోర్ట్ విన్ ఇంజెక్షన్, ఆల్ప్రా జోలమ్ లాంటి ఔషదాలను వినియోగిస్తున్నారు. కొంతమంది మందుల దుకాణాల యజమానులు... డబ్బుకు ఆశపడి వీటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఔషదనియంత్రణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని చాలాచోట్ల గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిందని... మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీరోజూ కొంతమంది బాధితులు తమ వద్దకు వస్తున్నారని చెబుతున్నారు. మొదట సరదాగా అలవాటై... ఆ తర్వాత వ్యసనంగా మారుతుందని వివరిస్తున్నారు. ఈ వ్యసనం ఉన్నావరు క్రమంగా... నేరస్తులుగా మారుతున్నారని చెబుతున్నారు. కౌమార, యవ్వన దశలో మాదకద్రవ్యాలకు ఆకర్షితులవుతారని... తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మత్తు పదార్థాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నా... అందుకు తగినట్లు కౌన్సిలింగ్, చికిత్స, పునరావాసం అందించే కేంద్రాలు అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా 450, రాష్ట్రంలో 11మాత్రమే ఉన్నాయి. వోడీఐసీ కేంద్రాలు ఏర్పాటు చేయటం మంచి పరిణామమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండీ... ధారలు కట్టిన రక్తం మాటున... మాంసం ముద్దలు