తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే మహానాడుకు ప్రవాసాంధ్రులు కూడా సిద్ధమవుతున్నారు. న్యూజిలాండ్‌లో నివసిస్తున్న తెదేపా అభిమానులు మహానాడుతో పాటు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30న ఆక్లాండ్ నగరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు న్యూజిలాండ్ తెదేపా ఫోరం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. న్యూజిలాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న తెదేపా అభిమానులు ఇందులో పాల్గొననున్నారు.
తెదేపా జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జూం మీటింగ్ ద్వారా.. ఈ వేడుకల్లో పాల్గొంటారని తెదేపా ఫోరం ప్రతినిధి శ్రీనివాస్ తెలిపారు. ప్రతిఏటా మహానాడు, ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేవాళ్లమని..ఈసారి కరోనా దృష్ట్యా నిరాడంబరంగా చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. వేడుకలకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టే కరోనా నివారణ చర్యలకు ఈ నిధులు ఉపకరిస్తాయన్నారు.
ఇవీ చదవండి: