NEW DISTRICTS ISSUE : రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల విభజన తీరుపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పెనమలూరు నియోజకవర్గాన్ని విజయవాడ జిల్లాలో కలపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల అభిష్టానికి ఎమ్మెల్యే పార్థసారథి కట్టుబడి ఉంటారా లేదా... అని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. నరసాపురం జిల్లా ఏర్పాటు మనందరి ఆత్మగౌరవం అని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు అన్నారు. నరసాపురం జిల్లా కోసం చేస్తున్న రిలే దీక్షలో ఆయన పాల్గొన్నారు.
మంత్రి సురేశ్ ఇల్లు ముట్టడి..
ప్రకాశం జిల్లా మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ... విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటిని భాజపా నాయకులు ముట్టడించారు. ర్యాలీ చేసుకుంటూ వచ్చి మంత్రి ఇంటి ముందు బైఠాయించారు. మార్కాపురం జిల్లా కోసం 10 రోజులుగా ఉద్యమిస్తున్నా... స్థానిక మంత్రికి గానీ ఎమ్మెల్యేలకు గానీ చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అంతకుముందు... పట్టణంలో అఖిలపక్షం నాయకులు ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. గడియార స్థంభం కూడలిలో భాజపా నాయకుడు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. మార్కాపురం జిల్లా కోరుతూ అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. కంభంలో జాతీయ రహదారిపై విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కందులాపురం సెంటర్‌లో మానవహారం చేపట్టి మార్కాపురం జిల్లా కోసం నినాదాలు చేశారు. కంభం ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని జేఏసీ పిలుపు మేరకు అన్ని పార్టీలు, వ్యాపార సంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
విద్యార్థులతో మానవహారం..
ఆదోని ప్రత్యేక జిల్లా కోసం మంత్రాలయంలో రాయలసీమ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో... 100 మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. ప్రజాసంఘాలను పోలీసులు అడ్డుకోవడంతో... కాసేపు వాగ్వాదం జరిగింది. అంతకుముందు ఎంపీడీవో కార్యాలయం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలన్న డిమాండ్‌తో పాణ్యంలో నిర్వహించిన బంద్ ప్రశాంతంగా సాగింది. పక్కనే ఉన్న నంద్యాలలో కాకుండా కర్నూల్‌లో కలపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి