NATIONAL HEALTH MISSION : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాలకు రాఖీలను కట్టి, డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. "రాఖీ పౌర్ణమి సందర్భంగా జగనన్నకు అక్కా, చెల్లెమ్మలు చేసుకొను వేడుకోలు.. కొవిడ్ కష్టకాలంలో కష్టపడిన మా కళ్లలో కన్నీరు మంచిదికాదు. అడగకుండానే అందరికీ అన్ని ఇచ్చావు. మాకు కనీస వేతనం వచ్చేలా చేయగలరు" అంటూ.. కర్నూలు, తదితర ప్రాంతాల్లో బ్యానర్లను ప్రదర్శించారు. 11వ పీఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలుచేయాలని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని నినదించారు.
ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు, కర్నూలు, అనంతపురం, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు సంఘం అధ్యక్షురాలు దయామణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాం యూపీహెచ్‌సీలోనూ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించి.. అధికారులకు విజ్ఞాపనపత్రాన్ని అందచేసినట్లు జేఏసీ రాష్ట్ర నాయకుడు సింహాచలం తెలిపారు. 35 రోజుల సాధారణ సెలవులు తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 22న సామూహికంగా సెలవుపెట్టి మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపడతామని వెల్లడించారు. అప్పటికీ డిమాండ్లు పరిష్కారం కాకుంటే ఈ నెల 29వ తర్వాత ఏ క్షణంలోనైనా సమ్మె చేపడతామని హెచ్చరించారు.