Lokesh letter to CM: చేనేత రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికులందరికీ "నేతన్న నేస్తం" అమలు చెయ్యాలని ముఖ్యమంత్రికి తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. తెదేపా హయాంలో చేనేత రంగానికి అమలైన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కొవిడ్ చేనేత కార్మికులను కోలుకోలేని దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తంచేశారు. చేనేత ముడిసరుకులైన చిలపలనూలు, సిల్క్, పట్టు ,రంగులు రసాయనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు.
వైకాపా పాలనలో చేనేత రంగానికి ఎలాంటి ప్రయోజనమూ దక్కడం లేదని ఆరోపించారు. సబ్సిడీలు, సంక్షేమ ప్రయోజనాలు, రుణ మద్దతు, పొదుపు నిధుల వడ్డీ రేట్లు, ఆప్కో ద్వారా ఉత్పత్తుల కొనుగోలు సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నేతన్న నేస్తం పథకం అమలులో లోపాలతో కార్మికుల కష్టాలు మరింతగా పెరిగాయని ధ్వజమెత్తారు. పథకం అమలు కోసం రూపొందించిన మార్గదర్శకాలు నిజమైన లబ్ధిదారుల ఎంపికకు ఉపయోగపడటం లేదన్నారు. ప్రతి వృత్తి నేత కార్మికుడితో సహా స్పిన్నర్లు ,ఇతర కార్మికులకు ‘నేతన్న నేస్తం’ కింద 24వేల రూపాయలను తప్పనిసరిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు, మాస్టర్ వీవర్ల కింద పనిచేస్తున్న 3 లక్షల కుటుంబాలను నేతన్న నేస్తం కింద చేర్చాలన్నారు. పథకం కింద అర్హత నిబంధనలను "సొంత మగ్గంతో నేత" నుంచి "నేత"గా మార్చాలని లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.
కష్ట సమయాల్లో చేనేత పరిశ్రమను ప్రోత్సహించడానికి ఒక్కొక్కరికి రూ. 1.5 లక్షల సబ్సిడీ రుణాన్ని అందించాలని తెల్చిచెప్పారు. ఆప్కో వద్ద అందుబాటులో ఉన్న మొత్తం స్టాక్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసి, బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. చేనేత కార్మికుల ఆర్థిక స్థితిగతులను పెంపొందించేందుకు పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు.గతం ప్రభుత్వంలా ప్రోత్సాహకాలు అందించాలన్నారు. చేనేత సమస్యలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి : వ్యవసాయశాఖపై సీఎం జగన్ సమీక్ష.. 16న "రైతు భరోసా" ఇవ్వాలని ఆదేశం!