విజయవాడ దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు నాగ వరలక్ష్మీ రాజీనామా చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్, ఈవోకు రాజీనామా లేఖను నాగ వరలక్ష్మీ పంపారు. నిన్న జగ్గయ్యపేటలోని తన కారులో మద్యం సీసాలు దొరికిన అంశంపై రాజీనామా చేసినట్లు తెలిపారు. తనకు తెలియకుండా మద్యం సీసాలను కారులో తరలించారని ఆమె పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యేవరకు సభ్యురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నిన్న నాగ వరలక్ష్మీ వినియోగిస్తోన్న కారులో 283 తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. నాగవరలక్ష్మి భర్త వెంకట కృష్ణప్రసాద్ తరచూ తెలంగాణకు వెళ్లి మద్యం తీసుకొస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తమ బృందాలు సోదాలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో వెంకట కృష్ణప్రసాద్‌తోపాటు కారు డ్రైవరు శివపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమ డ్రైవరు కారులో ఇంధనం నింపుకొని వస్తానని తీసుకెళ్లారని.. ఆ తర్వాత పోలీసులు పరిశీలిస్తే మద్యం దొరికిందని.. ఈ మద్యానికి తమకు సంబంధం లేదని నాగవరలక్ష్మి తెలిపారు.
ఈరోజు ఉదయం దుర్గగుడి ఈవో సురేష్‌బాబు, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడుకు లిఖితపూర్వకంగా సభ్యురాలు లేఖ రాశారు. తన కారులో మద్యం సీసాలు దొరికినందున.. ఈ విషయంలో తన ప్రమేయం లేదని.. ఇది పూర్తిగా డ్రైవర్ తప్పిదమేనని అన్నారు. ఈ విషయాన్ని డ్రైవర్ ఒప్పకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యేంత వరకు తాను ధర్మకర్తల మండలి సభ్యురాలిగా రాజీనామా చేస్తున్నట్లు లేఖలో నాగరలక్ష్మి వెల్లడించారు.
ఇదీ చదవండి: వివాదాల సుడిలో దుర్గగుడి