దక్షిణాదిలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గరే విద్యుత్ కొరత ఎక్కువని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏప్రిల్‌లో 382 మిలియన్ యూనిట్ల (ఎంయూ) విద్యుత్ కొరత ఉందని కేంద్ర విద్యుత్ శాఖ, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నివేదికలో వెల్లడించిందన్నారు. తమిళనాడులో 67, తెలంగాణలో 18, కర్ణాటక 18, కేరళ 12, పుదుచ్చేరిలో 1 ఎంయూ కొరత మాత్రమే ఉందన్నారు.
‘గత మూడు నెలల్లో అధిక ధరకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనడం వల్ల ప్రజలపై రూ.1,037 కోట్ల అదనపు భారం పడింది. కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వం మార్చిలో అత్యధికంగా యూనిట్ రూ.18.48 వంతున, ఏప్రిల్‌లో రూ.12.89, మేలో రూ.11.72 చొప్పున కొనుగోలు చేసింది’ అని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని అదానీకే అప్పగించి ఏపీ జెన్‌కోను.. అదానీ జెన్‌కోగా మార్చే కుట్రకు పాల్పడుతోందని ఆరోపించారు.
యాష్ హాపర్స్ కూలడానికి కారకులెవరు?.. ‘కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్‌లో యాష్ హాపర్స్ కూలడంతో మే 28 నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బినామీలకు హాపర్స్ నిర్వహణ కట్టబెట్టడం, వారు సరిగా నిర్వహించకపోవడమే దీనికి కారణం కాదా? విజయవాడ, కృష్ణపట్నంల్లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ ప్లాంట్ల పనులు తెదేపా హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయి.
మిగిలినవి మూడేళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదు? వీటీపీఎస్‌లో రూ.100 కోట్లు ఖర్చు పెడితే ఉత్పత్తి ప్రారంభించగలిగే అవకాశమున్నా ఎందుకు పనులు పూర్తి చేయలేదు? కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ప్రయోగాత్మక పరిశీలన పూర్తయినా ఎందుకు ప్రారంభించలేదు’ అని ప్రశ్నించారు. ‘అధిక ధరలకు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తు కొనడానికి ప్రభుత్వం గత మూడు నెలల్లో రూ.1,690 కోట్లు ఖర్చు చేసింది. సగటున రూ.3.15 నుంచి రూ.3.35 మధ్య ఖర్చయ్యే విద్యుత్తు కొనుగోలుకు రూ.7.64 నుంచి రూ.9.56 వరకు వెచ్చించింది’ అని పేర్కొన్నారు.
కోతలపై ప్రజల్లో అసహనం.. ‘విద్యుత్ కోతలపై ప్రజల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల సమావేశంలో ప్రస్తావించారు. తెదేపా హయాంలో కంటే మెరుగ్గా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నట్లు సీఎం సమర్థించుకున్నారు. రోజుకు రూ.40 కోట్ల బొగ్గు కొంటున్నట్లు చెప్పారు. కానీ ఆర్‌టీపీపీలో ఉండాల్సిన బొగ్గులో 4%, వీటీపీపీలో 20% మాత్రమే ఉందని నేషనల్ పవర్ పోర్టల్ వెల్లడించింది’ అని పట్టాభి చెప్పారు.
ఇవీ చూడండి: