MLA Roja fires on TDP: ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. తెదేపా 160 సీట్లు గెలుస్తుందని అచ్చెన్నాయుడు అంటున్నారని, తలకిందులుగా తపస్సు చేసినా 160 సీట్లు కాదు కదా.. ఇప్పుడున్న 23 సీట్లూ గెలవలేరని వైకాపా ఎమ్మెల్యే ఆర్.కె. రోజా విమర్శించారు. మరీ అంత సరదాగా ఉంటే అచ్చెన్నాయుడు టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే.. ప్రతి పోలింగ్ బూత్‌లో మహిళలు శక్తిని చూపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రోజా పాల్గొని ప్రసగించారు.
చంద్రబాబు, లోకేశ్‌కు స్త్రీల గురించి మాట్లాడే అర్హత లేదు. జగన్ మహిళా పక్షపాతి. రాష్ట్రంలో ప్రతి మహిళా ఆత్మగౌరవంతో జీవించొచ్చనే నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఆయన మహిళలకు అన్నే కాదు... దేవుడు. జగన్ వెనుక మహిళాశక్తి ఉంది. జగన్, చంద్రబాబు బోత్ ఆర్ నాట్ సేమ్’ -రోజా, ఎమ్మెల్యే
అనితతో చర్చకు సిద్ధమా?: రోజాకు.. తెదేపా నేత అయ్యన్నపాత్రుడు సవాల్
మహిళా దినోత్సవం సభ అనే విషయం మర్చిపోయి.. ‘జబర్దస్త్’ వేదిక అనుకుని ఎమ్మెల్యే రోజా రెచ్చిపోయి మాట్లాడారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. మంగళవారం విశాఖ జిల్లా నర్సీపట్నం విలేకర్లకు పంపిన వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడారు. రోజా తన ప్రసంగంలో సగం సమయం చంద్రబాబు, లోకేశ్‌ను తిట్టేందుకే కేటాయించారన్నారు. ‘దమ్ముంటే ఒక వేదిక మీదకు రా... మా పార్టీ నుంచి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనితను పంపిస్తాం. ఎవరేం చేశారో తేల్చుకోవచ్చు. ఆమెతో చర్చకు సిద్ధమా’ అని రోజాకు అయ్యన్న సవాల్ విసిరారు. చంద్రబాబు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చారని.. ఇంజినీరింగ్ కళాశాలలను 280కి పెంచారని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పెళ్లి కానుకను సీఎం జగన్ ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీస్‌స్టేషన్ పెట్టారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి:
High Court Building: కోర్టు భవన నిర్మాణాన్ని ఆంక్షల పేరుతో అడ్డకుంటారా..?: హైకోర్టు