రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, స్వచ్ఛ పల్లెలు, పట్టణాల రూపకల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా జూలై నెలలో సీఎం జగన్ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడం, స్వచ్ఛ గ్రామీణ, పట్టణాల కోసం అవసరైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. 5 వేల గ్రామాలను చెత్తరహిత గ్రామాలుగా తయారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్ళి తడి, పొడి చెత్తలను సేకరించడం వల్ల ఎక్కడా పారిశుద్ధ్య సమస్య లేకుండా వ్యవస్థను తయారు చేయవచ్చని తెలిపారు.
ఇటీవల ఇండోర్, అహ్మదాబాద్, అంబికాపూర్ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ వ్యవస్థలను పరిశీలించినట్లు మంత్రులు తెలిపారు. ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 9200 ఘన వ్యర్ధాల నిర్వహణ కేంద్రాలతో పాటు కొత్తగా మరో 4వేల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రులు వివరించారు.
ఇదీ చదవండి: 'అక్రమ కేసులు పెట్టి కోర్టులో చీవాట్లు తినడం జగన్ కుటుంబానికి అలవాటే'