భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి(vellampalli) శ్రీనివాసరావు తనదైన శైలిలో విమర్శలు చేశారు. సోము వీర్రాజు ఏ రోజు నిజాలు మాట్లాడరని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయిస్తే... రాష్ట్రం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని అమ్మవారిని ప్రార్ధించాల్సిన పని ఉండదన్నారు. విజయవాడ దుర్గగుడిలో శాకంబరీ ఉత్సవాల ముగింపు సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. పంచహారతుల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.
పార్టీకి అధ్యక్షునిగా నియమిస్తే ఆలయాలు సందర్శిస్తానని చేసుకున్న మొక్కులు చెల్లించుకునేందుకు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వీర్రాజు చేపట్టినట్టు ఉందని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు విడుదల కావడం లేదని అన్నారు. ఆలయాలను కూలగొట్టిన సమయంలో అప్పటి ప్రభుత్వంలో భాగస్వామిగా... దేవాదాయశాఖకు మంత్రిగా భాజపా ఉండి... ఇప్పుడు తమపై విమర్శలు చేయడం కపటప్రేమకు నిదర్శనమన్నారు. మతాల మధ్య వీర్రాజు చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ హయాంలో లేని విధంగా దేవాలయాలను ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి చేస్తున్నారన్నారు. దేవాలయాలను కూలగొట్టిన వారే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వం సంక్షేమానికి కట్టుబడి ఉందని... పథకాలను ఇవ్వకుండా తమ ముఖ్యమంత్రి చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోకుండా ఉండాలని భాజపా కోరుకుంటోందా.? అని వెల్లంపల్లి ప్రశ్చించారు.
ఇదీ చదవండి: