consumer commission: 'పత్రాలు పోగొట్టారు.. పరిహారం చెల్లించాల్సిందే..' - consumer commission
consumer commission: ఓ వ్యక్తి ఇంటి పత్రాలతో ఎస్బీఐలో రూ.10లక్షల రుణం తీసుకున్నారు. తిరిగి అతను రుణం చెల్లించినా బ్యాంకు ఒరిజినల్ సేల్‌డీడ్ ఇవ్వలేదు. అంతే కాకుండా రుణానికి చెందిన పత్రాలు బ్యాంకులో కనిపించకుండా పోయాయి. దీనిపై అతడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
consumer commission: ధ్రువీకరించిన(సర్టిఫైడ్) పత్రాలను ఇప్పించడంతో పాటు పరిహారం, ఖర్చుల కింద రూ.4.60 లక్షలు చెల్లించాలంటూ ఎస్‌బీఐని ఆదేశిస్తూ తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది. సికింద్రాబాద్‌కు చెందిన జి.సుధాకర్ 2013లో తన ఇంటిపై ఎస్‌బీఐ నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకుని తిరిగి చెల్లించినా బ్యాంకు ఒరిజినల్ సేల్‌డీడ్ ఇవ్వకపోవడంతో జిల్లా ఫోరాన్ని ఆశ్రయించారు. విచారించిన ఫోరం ఖాతాదారును వేదనకు గురిచేసినందున రూ.4.5 లక్షలు, ఖర్చులు రూ.10వేలు చెల్లించడంతోపాటు సర్టిఫైడ్ పత్రాలు ఇప్పించాలని బ్యాంకును ఆదేశించింది.
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎస్‌బీఐ దాఖలు చేసిన అప్పీలుపై రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్‌బీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2015లో రుణం తీరినా ఫిర్యాదుదారు 2019 దాకా బ్యాంకు నుంచి పత్రాలు తీసుకోలేదన్నారు. రుణాలకు చెందిన పత్రాలను ఒకేచోట భద్రపరుస్తామని, కార్యాలయం తరలింపులో అవి కనిపించకుండా పోయాయని అన్నారు.
దీనికి ప్రతిగా సర్టిఫైడ్ పత్రాలతోపాటు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్ ఇస్తామని బ్యాంకు కూడా చెప్పిందన్నారు. దీనికి భిన్నంగా ఆస్తి విలువను పరిగణనలోకి తీసుకోకుండా జిల్లా ఫోరం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం బ్యాంకు చర్యలపై జాతీయ కమిషన్ తీర్పు ఆధారంగా ఖాతాదారు పరిహారానికి అర్హుడేనని పేర్కొంది.
ఇదీ చదవండి: