జనసేనతో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని వీవీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. తన రాజీనామా ఆమోదం పొందిందని వెల్లడించారు. తన రాజీనామాకు కారణాలను లేఖలోనే పేర్కొన్నానని చెప్పారు. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని వివరించారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని వెల్లడించారు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని లక్ష్మీనారాయణ వివరించారు. ''మీరు భాజపాలో చేరుతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... ఏ పార్టీలోకి వెళ్లాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని... అలాంటిదేమైనా ఉంటే చెబుతా'' అని అన్నారు.
బడ్జెట్ బాగుంది...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020-21వ ఆర్థిక సంవత్సర బడ్జెట్ను లక్ష్మీనారాయణ ప్రశంసించారు. బడ్జెట్ ప్రజాహితంగా ఉందని... పలు రంగాలకు కేటాయింపులు బాగున్నాయని చెప్పారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీకి సప్లిమెంటరీ బడ్జెట్‌లో మరిన్ని నిధులు వచ్చే అవకాశముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి నిధులు రాబట్టేందుకు ఎంపీలు ప్రయత్నించాలని సూచించారు.