Rajgopal Reddy on Revanth: కాంట్రాక్టుల కోసం తాను పార్టీ మారుతున్నట్లు నిరూపించగలరా? అని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. నిరూపించకుంటే రేవంత్ పీసీసీ అధ్యక్ష పదవి వదులుకుంటారా అని సవాల్ చేశారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వాలని తాను అధిష్ఠానానికి చెప్పినట్లు నిరూపించాలని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.
"రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలర్.. ఆయనకు వ్యక్తిత్వం లేదు. మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలు నా వెంట ఉన్నారు. మా పార్టీలోకి వచ్చి మమ్మల్నే తప్పుపడుతున్నావు. రేవంత్‌రెడ్డి సీఎం అయి రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తితో కలిసి పనిచేయను. కాంగ్రెస్ పార్టీని రేవంత్‌రెడ్డి ఇష్టానుసారంగా తిట్టారు. పీసీసీ పదవిని అడ్డుపెట్టుకుని వేలకోట్లు సంపాదిస్తున్నారు." - రాజ్‌గోపాల్ రెడ్డి
రేవంత్ నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ భూస్థాపితం ఖాయమని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. రేవంత్‌రెడ్డి అవకాశ రాజకీయవాది అని అన్నారు. తాను బతికున్నంత వరకు కాంగ్రెస్‌ను విమర్శించనని చెప్పారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ కార్యకర్తలను విమర్శించే వ్యక్తిని కానని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం, కుటుంబపాలనకు వ్యతిరేకంగానే రాజీనామా చేసినట్లు తెలిపారు.
'రేవంత్ పథకం ప్రకారం తెదేపాను ఖతం చేసి కాంగ్రెస్‌లో చేరావు. సీఎం అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవాలని ప్లాన్ చేశావు. రాజీనామా చేసి చంద్రబాబుకు ఇచ్చి నాటకమాడావు. నీకు వ్యక్తిత్వం ఉంటే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాల్సింది. కానీ భయపడి రాజీనామా చేయకుండా డ్రామా చేశావు. 4 పార్టీలు మారిన వ్యక్తి నా మీద నిందలు వేస్తే ప్రజలు నమ్ముతారా. ఏ వ్యాపారం లేనిది కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి.? మానవత్వంతో పేదల కోసం పనిచేస్తే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. పీసీసీ పదవి నువ్వు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నావ్. సీఎం అయ్యి దోచుకోవడానికి కాంగ్రెస్‌లోకి వచ్చావు.' అని రేవంత్‌పై రాజ్‌గోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు.
తాను తెరాసలోకి వెళ్లడం లేదని ప్రజలకోసం పోరాడటానికి భాజపాలో చేరుతున్నానని రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు. తన కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. మునుగోడులో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని చెప్పారు. భాజపా వల్ల తనకు కాంట్రాక్ట్ వచ్చిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు.
ఇవీ చదవండి :