తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్.. ఇద్దరూ తోడు దొంగలేనని తెదేపా నేత, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై ఇరు రాష్ట్రాల మంత్రుల పరస్పర ఆరోపణల నేపథ్యంలో కేశినేని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా అని అన్నారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత కేసీఆర్, జగన్ మధ్య పరస్పర సహకారం ఉందిని కేశినేని ఆరోపించారు. ప్రజలను ఆ ఇద్దరూ కలిసి పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారని అంటూ ఘాటుగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకునేందుకే కేసీఆర్‌తో కలిసి జగన్ డ్రామా ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ డ్రామాలు గమనించలేనంత పిచ్చోళ్లు కాదని కేశినేని నాని అన్నారు.
ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు.. ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి, అక్కడ కేసీఆర్. ఎందుకంటే.. ఈయనకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయ్.. ఆస్తులు ఉన్నాయ్ జగన్ మోహన్ రెడ్డికి. ఇద్దరూ తోడు దొంగలు. 2019లో ఎన్నికల సమయంలో ఇద్దరూ కలిసి ఏం చేశారో చూశాం. ఎన్నికల్లో గెలిచాక ఇద్దరు ముఖ్యమంత్రులూ వాటేసుకున్నదీ చూశాం. నేను కూడా సంతోషంగా ఫీలయ్యా. ఇద్దరూ కలిసి పని చేస్తారనుకున్నా. రాష్ట్రంలో విభజన విషయంలో అనేక విషయాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులూ కూర్చుని ఆ సమస్యలు పరిష్కరిస్తారని అనుకుంటే.. ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు. అక్కడి ప్రజలను కేసీఆర్ మోసం చేస్తుంటే.. ఇక్కడి ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారు. ఎవరికి వాళ్లకు.. పర్సనల్ అజెండా తప్ప మరేదీ కనిపించడం లేదు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న ఆలోచన జగన్ మోహన్ రెడ్డికి ఏ మాత్రం లేదు. తెలంగాణలో.. వాళ్ల చెల్లిని పెట్టారు. ఇదో డ్రామా. అక్కడ షర్మిల గారు ఓ పార్టీ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డిది ఇక్కడో పార్టీ. ఆవిడ అక్కడ తెలంగాణ అంటారు. ఈయనేమో ఇక్కడ ఆంధ్రా అంటారు. అంతా కలిసి మధ్యలో ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. వీళ్లందరూ కలిసి ఆంధ్రా ప్రజలతో ఆడుకుంటున్నారు. అంతకంటే ఏం లేదు. వాళ్లంతా ఒకటే. అక్కడ కేసీఆర్ అయినా.. ఇక్కడ జగన్ అయినా.. షర్మిల అయినా అంతా ఒకటే.
- కేశినేని నాని, విజయవాడ ఎంపీ
ఇరు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతున్న నేపథ్యంలో.. కేశినేని నాని ఇలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి:
CM JAGAN: తెలంగాణలో మన ప్రజలున్నారు.. సామరస్యంగా పరిష్కరించుకుందాం