Jewellery Designer Vishnupriya: ఫ్యాషన్ డిజైన్ రంగం అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. నిత్యం కొత్తదనం కోసం ప్రయత్నిస్తుండాలి. అప్పుడే ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆలోచనలకు పదును పెడుతూ పోటీ ప్రపంచాన్ని ఆకర్షించాలి. అలాంటి జ్యూవెల్లరీ రంగంలో రాణిస్తుంది.. విజయవాడకు చెందిన జాస్తి విష్ణు ప్రియ.
భర్త ప్రోత్సాహంతో...
ఇంజనీరింగ్ చదివిన విష్ణు ప్రియ.. అందరిలా ఉద్యోగం కోసం ప్రయత్నించక నచ్చిన రంగం వైపు అడుగులేసింది. తనకెంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసింది. అనంతరం బంగారు ఆభరణాల వ్యాపారంలో ఉన్న భర్త ప్రోత్సాహంతో జ్యూవెల్లరీ డిజైన్‌పై దృష్టి సారించింది.
ప్రత్యేక స్కెచ్‌లు వేసి..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆడవాళ్లకి నచ్చిన విధంగా ఆభరణాలు తయారు చేయడమంటే ఆషామాషీ కాదు. అందులోనూ చిన్నపిల్లల దగ్గరనుంచి పెద్దవాళ్ల దాకా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉండాలనేది తన కోరిక. అందుకోసం ప్రత్యేక స్కెచ్‌లు గీస్తుంది. గీసిన స్కెచ్‌కి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో డిజైన్ చేస్తుంది. ఇదంతా పూర్తి కావడానికి సుమారు 15రోజుల సమయం పడుతుంది.
ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ..
ఆభరణాలు డిజైన్ చేసే సమయంలో విష్ణుప్రియకు ఎన్నో సమస్యలు ఎదురయ్యేవి. అయినా వాటిని అధిగమిస్తూ.. కార్పోరేట్ సంస్థలు తయారు చేసే డిజైన్లకు దీటుగా తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. ఆభరణాల తయారీలో బంగారం, వజ్రాలు,కలర్ డైమండ్స్‌ను మిళితం చేసి సరికొత్త డిజైన్లను రూపొందిస్తోంది. అలా 2021లో ఇండియన్ జ్యూవెల్లరీ మ్యాగ్‌జైన్ ఆధ్వర్యంలో జైపూర్‌లో నిర్వహించిన ఆభరణాల పోటీల్లో ఫైనలిస్ట్‌గా తన డిజైన్లు ఎంపికయ్యాయి.
సంస్కృతి, సంప్రదాయాలపై దృష్టి
విహారయాత్రలు, నూతన ప్రదేశాలు పర్యటించే విష్ణుప్రియ. అక్కడి ప్రజల సంస్కృతి, సంప్రదాయాలు దృష్టి పెడుతుంది. ప్రధానంగా మహిళల కట్టు, బొట్టు, వాళ్లు ధరించే ఆభరణాలను పరిశీలిస్తుంది. వాటి నుంచి తనకు కావాల్సిన నూతన డిజైన్స్ ఏమైనా లభిస్తాయా అని గమనిస్తుంటుంది.
వినూత్న డిజైన్ల తయారీకే అధిక ప్రాధాన్యత..
డిజైన్స్ కోసం హైదరాబాద్, బెంగళూర్‌ల నుంచి వినియోగదారులు వీరి దగ్గరికి వస్తుంటారు. ఆన్‌లైన్ ద్వారా విదేశాల నుంచి చాలా మంది ఆర్డర్స్ చేస్తున్నారు. మార్కెట్‌లోని పోటీ దృష్ట్యా.. వినూత్నమైన డిజైన్ల తయారీకే అధిక ప్రాధాన్యమిస్తున్నామని విష్ణుప్రియ భర్త భానుప్రకాష్ అంటున్నారు.
ఇంట్లో వారి సహకారంతో..
వ్యాపారంలో రాణించాలంటే ఇంట్లో వారి సహకారం తప్పనిసరి అవసరం. విష్ణుప్రియకు భర్త తోడ్పాటుతో పాటు అత్తమామల సహకారం ఉంది. దీంతో ఆమె ఎంచుకున్న రంగంలో స్వేచ్ఛగా పనిచేస్తు ముందుకు సాగుతోంది.
ఇదీ చదవండి:
హీరోయిన్స్ హ్యాట్ లుక్స్.. ఫొటోషూట్‌లో ఇప్పుడిదే ట్రెండ్!