రాష్ట్రంలో రెండు వారాలుగా పాజిటివ్ కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయన్నారు. గత వారం నుంచి 60 శాతం కేసులు గ్రామాల్లోనే నమోదవుతున్నాయన్నారు. 40 శాతం కేసులు పట్టణ ప్రాంతాల్లో వచ్చాయన్నారు. మరణాల్లో 58 శాతం గ్రామాల్లో...,42 శాతం పట్టణాల్లో నమోదవుతున్నాయని వెల్లడించారు.
ఆగస్టు కంటే సెప్టెంబరులో కరోనా పరీక్షలు పెరిగాయన్నారు. సెప్టెంబరులో కరోనా పరీక్షలు పెరిగినా పాజిటివ్ కేసులు తగ్గాయని తెలిపారు. ఆగస్టులో రోజుకి 91 మరణాలు, సెప్టెంబర్‌లో రోజుకి 51 మరణాలు చొప్పున నమోదయ్యాయని జవహర్‌రెడ్డి వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో అధిక ఫీజులు వసూలు చేసినట్లు ఆధారాలు ఇస్తే తక్షణమే దానిని సీజ్ చేస్తామన్నారు. అధిక ఫీజులు వసూలు చేసిన 25 ప్రైవేట్ ఆసుపత్రులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు.
ఐదు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
గిరిజనాభివృద్ధి ఉపప్రణాళికలో భాగంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రాంతాలలో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రూ.482 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ఆస్పత్రులను శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం, ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతాలలో నిర్మించనున్నారు. ఈ 5 ఆస్పత్రుల నిర్మాణానికి 246.30 కోట్ల మేర పాలనాపరమైన అనుమతులు మంజూరు చేయాలని వైద్య విద్యాశాఖ డైరెక్టర్ ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం.. నిధులు మంజూరు చేసిందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పన కోసం మరో రూ.235.70 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదీచదవండి