jangareddy gudem victims on spurious liquor deaths: జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాకు 25 మంది బలైన సంఘటనలో బాధ్యులను గుర్తించి వారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలని, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. వారివి సహజ మరణాలంటూ అసెంబ్లీని పక్కదారి పట్టించిన సీఎం జగన్ బాధిత కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని, వారి వద్దకెళ్లి పరామర్శించాలని సూచించారు. విజయవాడలో ఆదివారం రామకృష్ణ అధ్యక్షతన ‘జంగారెడ్డిగూడెం కల్తీ సారా మృతుల కుటుంబాల బహిరంగ నివేదన’ కార్యక్రమం జరిగింది. మృతుల జాబితాను చిరునామాలతో సహా ఈ వేదికపై విడుదల చేశారు.
బాధితులు కూలీలు, చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించేవారేనని.. అత్యధికులు ఎస్సీలు, బీసీలేనని వివరించారు. సారా తాగిన వారంతా వాంతులు, కడుపులో మంట, కంటిచూపు కోల్పోవడంవంటి ఒకే తరహా లక్షణాలతో చనిపోయారని.. ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని రామకృష్ణ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, తెదేపా నాయకురాలు చెన్నుపాటి ఉషారాణి, సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, దుర్గాంబ, సీపీఎం నాయకుడు మంతెన సీతారాం కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మూడేళ్లనుంచే నాటు సారా అమ్ముతున్నారని, అంతకుముందు లేదని..జంగారెడ్డిగూడెం మండల సీపీఐ కార్యదర్శి ఎం.కృష్ణచైతన్య అన్నారు.
జంగారెడ్డిగూడెంలో నాటుసారా తాగి 25మంది చనిపోయారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన చెందారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించటం బాధాకరమన్నారు.
దుర్మార్గంగా వాస్తవాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పే స్థాయికి సీఎం దిగజారారు. కల్తీసారా తాగిన తర్వాత కడుపులో మంటతో ఇబ్బంది పడ్డారు. కల్తీసారా తాగిన తర్వాత బాధితులకు కళ్లు కనపడలేదు. బాధితులు కల్తీసారా తాగి వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. చనిపోయిన వ్యక్తులు గతంలో ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులే చెప్పారు.నాటుసారాకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు 148 కేసులు పెట్టారు.ఎస్‌ఈబీ అధికారులు 156 మందిపై కేసులు నమోదు చేశారు. బాధిత కుటుంబాలతో ప్రభుత్వం మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలి. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. -రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
అనారోగ్య సమస్యలే కారణమని చెప్పమన్నారు..
తమ కుటుంబ సభ్యులవి సహజ మరణాలు కావని, కల్తీ సారాకే బలయ్యారని మృతుల కుటుంబీకులు మరోమారు స్పష్టం చేశారు. అయినా వారు అనారోగ్యంతో చనిపోయారంటూ తమతో చెప్పించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వేదికపై వారు తమ గోడు వినిపించారు.
అలా మేం చెప్పబోమన్నాం..
‘మా మావయ్య రైస్‌మిల్లులో పని చేసేవారు. సారా ప్యాకెట్లు తెచ్చుకుని 9వతేదీన ఇంటి వద్దే తాగారు. వాంతులు మొదలయ్యాయి. అదే రోజు రాత్రి కంటిచూపు పోయింది. 10వ తేదీ ఉదయం వరకూ వాంతులవుతూనే ఉన్నాయి. ఆసుపత్రిలో చేర్చాం. అదే రోజు సాయంత్రం 6.40కి చనిపోయారు. ఆయనకు అంతకు ముందు అనారోగ్య సమస్యలు లేవు. కల్తీసారా తాగే చనిపోయారని 14న ఏలూరులో అధికారుల ఎదుట వాంగ్మూలమిస్తే.. అనారోగ్య సమస్యలు కారణమని చెప్పమన్నారు. అలా మేము చెప్పలేమంటూ అక్కడినుంచి వచ్చేశాం’
- మృతుడు కాళ్ల దుర్గారావు కోడలు నాగమణి
సారా తాగాక వాంతులు మొదలయ్యాయి..
‘మా అబ్బాయి కూలికి వెళుతుంటాడు. 9న ఉదయం 4 గంటలకు పనికి బయటకు వెళ్లాడు. మళ్లీ 7 గంటలకు ఇంటికొచ్చాడు. అప్పటికే సారా తాగి ఉన్నాడు. వస్తూనే ఒంట్లో బాగోలేదంటూ నిద్రపోయాడు. కాసేపటికి వాంతులయ్యాయి. కళ్లు తిరుగుతున్నాయన్నాడు. ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. వారు ఏలూరు తీసుకెళ్లమన్నారు. అక్కడి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చూపిస్తే అప్పటికే చనిపోయాడన్నారు. కల్తీసారా వల్లే మా అబ్బాయి చనిపోయాడు.-మృతుడు దోసూరి సన్యాసిరావు తల్లి ఉదయమ్మ
ఖాళీ కాగితాలపై సంతకాలు చేయాలన్నారు..
‘మా అబ్బాయి మటన్ దుకాణంలో పని చేస్తాడు. పదేళ్లుగా తాగుడు అలవాటుంది. ఆ రోజు సారా తాగి ఇంటికొచ్చాడు. కడుపులో తిప్పుతోందని, గుండెలో మంటగా ఉందని చెప్పాడు. వాంతులు, విరేచనాలయ్యాయి. కళ్లు మండుతున్నాయన్నాడు. చెమటలు పట్టేస్తుండటంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. తర్వాత చనిపోయాడు. కల్తీ సారాయే మావాణ్ని బలి తీసుకుంది. ఇద్దరు పోలీసులు రెండుసార్లు మా ఇంటికొచ్చారు. ఖాళీ కాగితాలపై సంతకాలు చేయాలన్నారు. కారణం చెబితేనే పెడతామని మేము పట్టుబట్టాం. అరగంటపాటు మా ఇంటి వద్దే కూర్చున్నారు. ఆ తరువాత వెళ్లిపోయారు. ఫిబ్రవరిలో విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో మాఅబ్బాయికి చేయించిన వైద్య పరీక్షల్లో అంతా బాగానే ఉందని తేలింది.’
- మృతుడు షేక్ యాకూబ్ తల్లి ఫాతిమా
సీపీఐ జాబితా ప్రకారం.. కల్తీ సారా మృతులు వీరే..
1. చింతపల్లి సూరిబాబు (42), (ఓసీ), మదర్ థెరిస్సా సెంటర్
2. ముడిచర్ల అప్పారావు (46) (బీసీ), బుట్టాయిగూడెం రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్
3. బండారు శ్రీను (49), (బీసీ), బుట్టాయిగూడెం రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్
4. బొంకూరి రాంబాబు (60), (బీసీ), బుట్టాయిగూడెం రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్
5. కొప్పాక వెంకటేశ్వరరావు (48), (బీసీ), కాజా పంతులు హోటల్ వద్ద, టీఎస్‌ఆర్ కాంప్లెక్స్
6. వేగ్నేశ నాగ వెంకటసుబ్బరాజు (48), (ఓసీ), వివేకానంద కాలేజీ వద్ద
7. బంగారు ఎర్రయ్య (65), (బీసీ), సాలిపేట, పొగాకు గోదాము వద్ద
8. సీదిరాల పోశయ్య (38), (బీసీ), త్రివేణి కాలేజీ దగ్గర, టెలికాంనగర్
9. పోలుపర్తి సత్యనారాయణ (62), (బీసీ), లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద
10. పితాని వెంకటరమణ (36), (బీసీ), రాజీవ్‌నగర్ గుహ దగ్గర
11. చంద్రగిరి శ్రీను (40), (బీసీ), లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర
12. కాళ్ల దుర్గారావు (61), (బీసీ), సౌభాగ్య థియేటర్ వెనక
13. పైడేటి సత్యనారాయణ (73), (ఓసీ), ప్రభుత్వాసుపత్రి ఎదురుగా
14. దోసూరి సన్యాసిరావు (38), (ఎస్సీ), మసీదు వెనుక, హరిజనపేట
15. సలాది ఆనంద్ (43), (ఓసీ), రాజుల కాలనీ, కేఎల్‌ఎన్‌రాజు గారి వీధి
16. దేవరశెట్టి చక్రపాణి (64), (ఓసీ), చంద్రశేఖర కల్యాణ మండపం ఎదురుగా, బట్టాయిగూడెం రోడ్డు
17. వెంపల అనిల్‌కుమార్ (39), (ఎస్సీ), ఉప్పలమెట్ట
18. సునయన ఉపేంద్ర, (ఎస్సీ), హైస్కూల్ ఎదురుగా
19. షేక్‌యాకూబ్ (50), (బీసీ), పాతబస్టాండ్, లయోలా స్కూల్ ఎదురుగా
20. కూచింపూడి సత్యనారాయణ (40), (బీసీ), రాజుల కాలనీ
21. షేక్ సుభానీ (44), (బీసీ), చంద్రశేఖర కల్యాణమండపం ఎదురుగా, బుట్టాయిగూడెం రోడ్డు
22. కుమ్మరిపాలెం సత్తిబాబు (39), (బీసీ), సాలిపేట జంక్షన్
23. ఉయ్యాల శ్రీనివాసరావు (33), (ఎస్టీ), సోంబాబుగారి ఇంటి వద్ద
24. పొనకల వెంకటగణపతి (56), (ఓసీ), రమాదేవి ఆసుపత్రి పక్కన
25. వాకాడ సాయిరెడ్డి (50), బీసీ, రెడ్డిపేట, లక్కవరం
ఇదీ చదవండి:
జంగారెడ్డిగూడెంలో మానవహక్కులు, సామాజిక న్యాయం రాష్ట్ర కమిటీ పర్యటన