పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఊడిపోవడం అత్యంత దురదృష్టకరమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంత సురక్షితంగా ఉందో గేట్లు నాణ్యత, వాటి పని తీరు ద్వారా ప్రాథమిక అంచనాకు వస్తారన్న ఆయన.. అలాంటిది జల ప్రవాహం ధాటికి గేటు విరిగిపోవడం, అందుకు సంబంధించిన యాంకర్ తెగిపోవడం చూస్తుంటే పులిచింతల ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణ అంశాలపై భయాందోళనలు నెలకొంటున్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉందని జలవనరుల ఇంజినీరింగ్ నిపుణులు తొలి నుంచి చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది వాస్తవమని జనసేవాని అన్నారు. ప్రభుత్వం డ్యాం నిర్వహణ విషయంలో తగినంత శ్రద్ధ చూపకపోవడం వల్ల వచ్చిన దుష్ఫలితమే ఇదని పవన్ కల్యాణ్ విమర్శించారు.
16వ గేటు విరిగి కొట్టుకుపోయిన క్రమంలో మిగిలిన గేట్లపై ఒత్తిడి పెరిగిపోతుందని.. ఇది ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నా పాలకులు మౌనంగా ఉండటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పులిచింతల ప్రాజెక్ట్ భద్రతపై ముఖ్యమంత్రి అత్యవసర సమీక్ష ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. 44 TMCల నీటి నిల్వలు ఉన్న ఈ ప్రాజెక్టును ఇప్పుడు ఎలా కాపాడుతారో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పులిచింతలతోపాటూ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి, అక్కడి రక్షణ చర్యలు, నిర్వహణకు తీసుకున్న చర్యలను తక్షణమే ప్రజలకు వివరించాలన్నారు. అదే విధంగా ప్రతి ఏటా ప్రాజెక్టుల నిర్వహణపై ఇంజినీరింగ్ నిపుణులతో సోషల్ ఆడిట్ చేయించి.. ఆ వివరాలను అందరికీ వెల్లడించాలని పేర్కొన్నారు. రాష్ట్ర పాలకులకు - వ్యక్తిగత ప్రచారం వచ్చే కార్యక్రమాలపై మాత్రమే దృష్టి ఉంటోందన్న ఆయన., వాటికే నిధులు మళ్లించి సమీక్షల పేరిట ప్రచారం చేస్తున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు, వాటి నిర్వహణపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేయాలనే శ్రద్ధ లేదని మండిపడ్డారు.
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట పులిచింతల ప్రాజెక్ట్ గేటు విరిగిపోయి, ప్రాజెక్ట్ ప్రమాదంలో పడటంగా పేర్కొన్నారు. గేటు విరిగిపోవడం వల్ల 34 TMCల జలాలు సముద్రం పాలవుతున్నాయని, పై నుంచి పులిచింతలకు వచ్చే మరో 15 TMCలను కూడా సముద్రంలోకే వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు కారణం ప్రాజెక్ట్ విషయంలో జలవనరుల శాఖ నిర్లక్ష్యమేనన్నారు. ఇంతటి జల సంపద సముద్రం పాలవడం వల్ల రాబోయే రోజుల్లో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు స్థాయి దిగువకు చేరే ప్రమాదం ఉందన్నారు. పులిచింతల ప్రాజెక్టులో ఒక గేటు విరిగితే నీటిని సముద్రంలోకి వదిలివేయవచ్చు.. అయితే ప్రాజెక్టు మొత్తం ప్రమాదంలోపడితే తలెత్తే ఉత్పాతాన్ని ఊహించడానికే భయమేస్తుందన్నారు.
గేటు విరిగి తీవ్ర నష్టం జరిగాక డ్యాం భద్రతపై కమిటీ వేస్తామని చెప్పడంతో బాధ్యత తీరిపోదన్న పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వ కాలంలోనే పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణలో లోపాలు ఉన్నాయని, ఇక్కడ రక్షణ చర్యలు సరిగా లేవు అని నీటిపారుదల రంగ నిపుణులు ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నిపుణుల మాటలను పెడచెవిన పెట్టిందన్నారు. ఇప్పటికైనా పులిచింతలతోపాటు రాష్ట్రంలోని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణపై శ్రద్ధపెట్టి ప్రత్యేక నిధులు కేటాయించి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పులిచింతల ప్రాజెక్ట్ ఏ మేరకు పదిలం అనేది నిగ్గు తేల్చడంతోపాటు అక్కడి నిర్మాణ, నిర్వహణ లోపాలు ఏ విధంగా చక్కదిద్దాలి అనే విషయాలపై అధ్యయనం చేసేందుకు అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని నియమించాలని లేని పక్షంలో నిర్మాణ లోపాలతో ఉన్న పులిచింతల ప్రాజెక్ట్ వల్ల దిగువ ప్రాంతాలు ప్రమాద భయంతో బతకాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:
'వైఎస్ హయాంలో నాసిరకం పనుల వల్లే.. పులిచింతల గేటు కొట్టుకుపోయింది'