ప్రస్తుతం టెలీస్కోపిక్ విధానంలో హైదరాబాద్ జలమండలి నీటి బిల్లులు వసూలు చేస్తోంది. స్లాబ్‌ల వారీగా నల్లా ఛార్జీలు చెల్లించాలి. ఉదాహరణకు నెలకు 15 కిలో లీటర్ల(కి.లీ.) నీటిని వాడే ఓ నల్లాదారుడు 0-15 శ్లాబు కింద ప్రతి కి.లీ.కు నెలకు రూ.10 నీటి ఛార్జీతోపాటు మొత్తం బిల్లుపై 33 శాతం మురుగు ఛార్జీ చెల్లించాలి. నిర్ణీత సమయం కంటే 3-5 రోజులు ఆలస్యంగా రీడింగ్ నమోదు చేయడం వల్ల శ్లాబు మారుతుంది.
అప్పుడు 16-30 శ్లాబులోకి చేరితే ఆటోమేటిగ్గా ప్రతి కి.లీ.కు ఛార్జీ పెరుగుతుంది. మొత్తం బిల్లులపై మురుగు ఛార్జీలూ పెరిగి అదనపు భారం పడుతుంది. వాస్తవానికి జలమండలి నిబంధనల ప్రకారం 30-31 రోజులకు మాత్రమే రీడింగ్ నమోదు చేయాలి. కొన్ని ప్రాంతాల్లో 36-38 రోజులకు నమోదు చేస్తుండడం నీటి బిల్లుల పెరుగుదలకు కారణమవుతోంది. రీడింగ్ నమోదు, బిల్లుల పంపిణీకి జలమండలి పొరుగు సేవల సిబ్బందిపై ఆధారపడుతోంది. వీరికి ఏటా రూ.కోట్లలోనే చెల్లిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహణలో ఈ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.
పక్కాగా ఉండే ప్రత్యామ్నాయ విధానం మేలు
గ్రేటర్ వ్యాప్తంగా 25 వేల వాణిజ్య, పరిశ్రమల నల్లా కనెక్షన్లకు గతంలో ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) విధానాన్ని అమర్చారు. వీటితో 30-31 రోజులకే ఆటోమేటిగ్గా రీడింగ్ నమోదవుతుంది. శ్లాబ్ మారిపోయే పరిస్థితి తలెత్తదు. ఈ మీటర్లను ట్యాంపరింగ్ చేయడం సాధ్యమవదు. చేయాలని చూసినా అధికారులకు తెలిసిపోతుంది.
గతంలో చిన్న అపార్ట్‌మెంట్లు, ఇతర గృహాలకు ఇదే విధానాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. అందుకయ్యే ఖర్చు జలమండలి భరించి.. వాయిదాల పద్ధతిలో నల్లాదారుల నుంచి వసూలు చేయాలనుకున్నా ముందుకు సాగలేదు. అటు నల్లాదారులకు, ఇటు జలమండలికి ఇబ్బంది లేకుండా పక్కాగా ఉండే ప్రత్యామ్నాయ విధానం ఆలోచిస్తే బాగుంటుందన్నది ఇరువర్గాల అభిప్రాయంగా ఉంది.
- ఇదీ చూడండి: కరోనా ఫ్యాషన్.. అందుబాటులో డిజైనర్ మాస్కులు!