రాష్ట్రంలో 2021-22 సీజనులో రైతు భరోసా కేంద్రాల ద్వారా నూరు శాతం ధాన్యం కొనుగోలు చేయించాలని మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. విజయవాడలోని సివిల్‌సప్లయిస్ భవన్‌లో మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు, రంగనాథరాజు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఛైర్మన్ భాస్కరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.
ప్రస్తుత ఏడాది ధాన్యం కొనుగోళ్లుపై సమీక్షించడంతోపాటు వచ్చే సీజనులో తీసుకోవాల్సిన చర్యలపైనా నిశితంగా చర్చించారు. ధాన్యం మద్దతు ధర నూరు శాతం రైతులకు చేరాలన్నారు. మద్దతు ధర కంటే తక్కువ మొత్తంతో ధాన్యం కొనుగోళ్లు లేకుండా చూడాలని నిర్ణయించారు. అన్ని రైతు భరోసా కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కావాలన్న సీఎం సూచనను నూరు శాతం అమలు చేస్తామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికను సీఎంకు అందజేస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదనే విషయంపైనా ఈ సమావేశంలో చర్చించారు. రేపటి నుంచి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా తగిన సూచనలు చేసినట్లు చెప్పారు. చౌకధర దుకాణ డీలర్ల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. ఈనెల వారి సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని మంత్రి కొడాలి నాని హామీ ఇచ్చారు. డీలర్లు తాము ఆందోళన బాట పడితే ప్రభుత్వం రేషను సరఫరాలో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : CM Jagan: పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలి: సీఎం జగన్