ఏపీ నుంచి తెలంగాణలోకి వచ్చే అంబులెన్సులను సరిహద్దుల వద్ద నిలిపేసిన ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రభుత్వ వివరణ ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. సర్క్యులర్, అడ్వైజరీ లేకుండా ఎలా నిలిపివేస్తారని నిలదీసింది. సరిహద్దుల వద్ద అంబులెన్సులు ఆపవద్దని పోలీసులను ఆదేశించింది.
రేపట్నుంచి 10 రోజులపాటు తెలంగాణలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హైకోర్టుకు ఏజీ ప్రసాద్ నివేదించారు. ఈ విషయంపై స్పందించిన.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. వారాంతపు లాక్‌డౌన్, రాత్రి కర్ఫ్యూ పొడిగించమని అడిగితే పట్టించుకోలేదని రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడు కేసులు తగ్గుతున్నప్పుడు అకస్మాత్తుగా లాక్‌డౌన్ అంటున్నారని అసహనం వ్యక్తం చేసింది. వలస కూలీలు ఉన్నట్లుండి ఎలా వెళ్తారని ప్రశ్నించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రద్దీ ఎలా నియంత్రిస్తారని ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే సగం మంది వలస కూలీలు వెళ్లిపోయారని చెప్పిన ఏజీ.. వలస కూలీల బాగోగులు ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 వరకు జనం గుమిగూడకుండా చూడాలని సూచించింది.
కొవిడ్ మూడో దశపై..
లాక్‌డౌన్ సమయంలో కరోనా టీకా రెండో డోసు తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల అమలుపై కార్యాచరణ రూపొందించాలని.. ఆక్సిజన్ సరఫరాపై కేంద్ర, రాష్ట్రాలు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. డిమాండ్‌కు తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. కొవిడ్ మూడో దశ కూడా పొంచి ఉందని అంటున్నందున ప్రణాళిక చెప్పాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షల గరిష్ఠ ధరలపై జీవో ఇవ్వాలని సూచించింది.
రంజాన్ వేడుకలపై..
ఈనెల 14న రంజాన్ వేడుకలను వీడియోగ్రఫీ చేయాలని పోలీసులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రంజాన్ వేడుకలపై ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని చెప్పింది. తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: