అమూల్ పాల సేకరణ, వ్యాపార అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన సొమ్ము ఖర్చు చేయవద్దని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు , అమూల్ డెయిరీ దాఖలు చేసిన కౌంటర్లుకు తిరుగు సమాధానంగా కౌంటర్లు దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు కోరారు. ఆ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు బదలాయించే నిమిత్తం ఏపీ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టులో పిల్ వేశారు. మంత్రివర్గ నిర్ణయాన్ని చట్ట , రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. అమూల్ కోసం ప్రభుత్వ సొమ్ము ఖర్చుచేయవద్దని ప్రభుత్వాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తాజాగా జరిగిన విచారణలో ఈ వ్యాజ్యంలో తాము కౌంటర్లు వేశామని ఎన్ డీడీబి, అమూల్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ప్రయోజనం పొందుతున్నామని ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చుకొని తాము వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని పాల ఉత్పత్తిదారులు మూడు అనుబంధ పిటిషన్లు వేశారు. న్యాయస్థానం వాటిని స్వీకరించేందుకు తమకు అభ్యంతరం లేదని ఎంపీ తరఫు సీనియర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంప్లీడ్ పిటిషన్లను న్యాయస్థానం అనుమతించింది.
ఇదీ చదవండి:
ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్ష చూపుతోంది: కేంద్రమంత్రి షెకావత్‌కు సీఎం జగన్ లేఖ