HC On Bezawada Court Building: విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణ పనులపై హైకోర్టు సంతృప్తి వ్యక్తంచేసింది. ఇటీవల పనులను స్వయంగా పరిశీలించినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర తెలిపారు. పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఫర్నిచర్ సమకూర్చడం కోసం ఎలాంటి చర్యలు చేపట్టారో తెలపాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. టెండర్ వివరాలను కోర్టు ముందు ఉంచాలని పేర్కొంటూ... విచారణను ఈనెల 28 కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
విజయవాడలోని బహుళ అంతస్తుల కోర్టు భవన సముదాయ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని సవాలు చేస్తూ న్యాయవాది చేకూరి శ్రీపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. పలుకారణాలు చూపుతూ కోర్టు భవన నిర్మాణ పనులను పోలీసులు జరగనివ్వడం లేదని గత విచారణలో గుత్తేదారు తరపు సీనియర్ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. గుత్తేదారు తరపు సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టర్ లేవనెత్తిన అభ్యంతరాలను అధికారులు పరిష్కరించారన్నారు. మే రెండో వారానికి భవనాన్ని అప్పగిస్తామన్నారు. అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ .. ఎనిమిదో అంతస్తుకు అనుమతి ఇచ్చామన్నారు . కాంట్రాక్టర్ అభ్యంతరాలను పరిష్కరించామన్నారు. ఫర్నిచర్ కోసం త్వరలో టెండర్లు ఆహ్వానిస్తున్నామన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు .
ఇదీ చదవండి:అప్పుడు పెగాసస్ కొనలేదు.. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: ఏబీవీ