రాష్ట్రవ్యాప్తంగా జూన్ 21 నుంచి జులై 20వరకు ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాలు నిర్వహిస్తామని నేషనల్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేముల భానుప్రకాశ్ తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ శిబిరాల ద్వారా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అనుమతించిన ఆయుర్వేద మందులను ప్రజలకు అందిస్తామన్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, యోగాసనాల గురించి సూచిస్తామని చెప్పారు.
జూన్ 21న యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని డా. ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్లో మొదటి వైద్య శిబిరం ప్రారంభిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ జిల్లాల్లో ఉన్న ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తామని వేముల భాను ప్రకాశ్ వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవటంలో ఆయుర్వేదం ఎంతో ఉపయోగపడుతుందని.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు