IT IN VIJAYAWADA: విశాఖ, తిరుపతి, అనంతపురం మూడు నగరాల్లో ఐటీ కాన్సెప్ట్ సిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడనూ ఆ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఐటీ దిగ్గజ నగరాలైన బెంగళూరుకు సమీపంలో ఉన్నందున అనంతపురం, చెన్నైకు దగ్గరలో ఉన్న తిరుపతిని కాన్సెప్ట్ నగరాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బెంగళూరు, చెన్నైల్లోని ఐటీ సంస్థలు భవిష్యత్ విస్తరణలో సమీపంలో ఉన్న అనంతపురం, తిరుపతిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసేలా ఆకర్షించాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే ఐటీ కంపెనీలకు కేంద్రంగా ఎదుగుతున్న విశాఖను కూడా మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధిక మంది ఐటీ ఉద్యోగులున్న విజయవాడను కూడా ఐటీ కాన్సెప్ట్ సిటీల జాబితాలో చేర్చితే బాగుంటుందని, హైదరాబాద్‌కు సమీపంలోనే ఉన్నందున అక్కడి ఐటీ సంస్థలు ప్రత్యామ్నాయంగా బెజవాడకు వచ్చేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
గత ప్రభుత్వం ఐటీ విధానాన్ని ప్రకటించి రాయితీలు ఇవ్వడంతో రాష్ట్రంలో అత్యధికంగా విజయవాడ, గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లోనే వంద వరకు ఐటీ సంస్థలు ఏర్పాటయ్యాయి. కొత్త ప్రభుత్వం వచ్చాక రాయితీలను ఆపేయడంతో వీటిలో చాలా కంపెనీలు ఇక్కడి నుంచి ఇతర నగరాలకు వెళ్లిపోయాయి. గన్నవరంలోని హెచ్‌సీఎల్‌లో 2,200 మంది, విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న మేథ ఐటీ టవర్స్‌లో రెండువేల మంది ఐటీ నిపుణులు పని చేస్తున్నారు. ఆటోనగర్ ఐటీ పార్క్ భవనం, బెంజి సర్కిల్, రామవరప్పాడు, ఎనికేపాడు, మంగళగిరిలోని ఐటీ టవర్లు.. ఇలా విజయవాడ, చుట్టుపక్కలున్న ఐటీ కంపెనీల్లో ఆరు వేల మంది వరకు ఉద్యోగులున్నారు.
ఐటీకి అనేక అనుకూలతలు
* విజయవాడలో ఏటా ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీతో కలిపితే.. రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువులు పూర్తిచేసి బయటకొస్తున్నారు. ఇందులో ఇంజినీరింగ్ విద్యార్థులే 30 వేల మందికి పైగా ఉంటారు. అందుకే ఐటీ కంపెనీలకు కావల్సినంత మానవ వనరులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చదువులు పూర్తి చేసిన విద్యార్థులు ఎక్కువ మంది హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని కంపెనీల్లో కొలువులు సాధిస్తున్నారు.
* కార్పొరేట్ ఐటీ కంపెనీల ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు విజయవాడలో ఎన్నో విద్యాసంస్థలు, ఆసుపత్రులు ఉన్నాయి.
* ఐటీ కంపెనీలు ఉన్నతాధికారులు, క్లయింట్లు వేగంగా రాకపోకలు సాగించడానికి విమానాశ్రయం ఉందా లేదా అనేది చూస్తాయి. విజయవాడలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దేశంలో ఏ మూలకైనా వెళ్లగలిగే రోడ్డు, రైలు అనుసంధానత ఉంది.
ప్రభుత్వ ఐటీ సిటీల కాన్సెప్ట్ ఇదీ..
* రెండు వేల ఎకరాలను ఎంపిక చేసి పర్యావరణహిత ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ గ్రీన్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకు మాత్రమే అవకాశమిస్తారు.
* ఐటీ సంస్థల కార్యకలాపాలను వెంటనే ప్రారంభించేలా ప్రపంచ స్థాయి సౌకర్యాలుంటాయి.
* విమానాశ్రయాలు, రహదారులకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తారు.
* ప్రధాన సంస్థకు అనుబంధంగా కంపెనీలు ఏర్పాటయ్యేలా ప్రోత్సహిస్తారు.
* నైపుణ్యం కలిగిన మానవ వనరుల తయారీకి కార్యాచరణ.
* ఐటీ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన గృహ సముదాయాలను ఇక్కడే ఏర్పాటు చేస్తారు. నడక, సైక్లింగ్ ట్రాక్‌లు, ఆహ్లాదం కోసం పార్కులు వంటివి అభివృద్ధి చేస్తారు. వాణిజ్య సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక ప్రదేశం.
ఇదీ చదవండి:CM Jagan Delhi Tour: 'విశాఖ-భోగాపురం 6 వరుసలకు దారి చూపండి'