Schools Reopens in Telangana: ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అధికారకంగా ప్రకటించనుంది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించడం వల్ల సర్కార్ ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణమే. పదో తరగతి పరీక్షలు కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.
తెరిచేందుకే మొగ్గు..
కరోనా మూడో ముప్పు, ఒమిక్రాన్ వ్యాప్తితో తెలంగాణలో కేసులు పెరగడం వల్ల ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడం వల్ల ఆ సెలవులను 30 వరకు పొడిగించారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ, విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి టీకా ఇవ్వడం.. మరోవైపు జ్వర సర్వే పూర్తవ్వడం వల్ల కరోనా వ్యాప్తి తీరును అంచనా వేసిన సర్కార్.. విద్యాసంస్థలు తెరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఎప్పుడు తెరుస్తారు..?
ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తుండటం.. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది. మరోవైపు.. పాఠశాలల ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని శుక్రవారం రోజున హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో.. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
తెరవగానే షెడ్యూల్..
ఇప్పటికే ఇంటర్, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగుతుండటం వల్ల పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
- ఇదీ చదవండి : రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!