రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ)గా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రి సలహాదారుగా పనిచేసినందున ఎస్‌ఈసీగా ఆమె స్వతంత్రంగా విధులు నిర్వర్తించలేరనేది పిటిషనర్ ఆరోపణ మాత్రమేనని పేర్కొంది. అలా అనేందుకు కోర్టు ముందు ఆధారాలు ఉంచడంలో పిటిషనర్ విఫలమయ్యారని తెలిపింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్నాకే ఎస్‌ఈసీగా నీలం సాహ్నిని గవర్నర్ నియమించారని వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
వ్యాజ్యం నేపథ్యమిదే..
ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా, నిష్పాక్షికంగా ఉండే వ్యక్తిని ఎస్‌ఈసీగా నియమించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఆ తీర్పునకు విరుద్ధంగా ఎస్‌ఈసీ నియామకం జరిగిందన్నారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై వాదనలు పూర్తి అవడంతో తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు.
‘ప్రస్తుత కేసును మరో కోణంలో చూస్తే.. మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయి. ఆ పద్ధతిలోనే ముఖ్యమంత్రి ఓ న్యాయవాది పేరును న్యాయమూర్తి పోస్టుకు సిఫారసు చేయవచ్చు. ఆ పేరును హైకోర్టు సీజే నేతృత్వంలోని కొలీజియం పరిగణనలోకి తీసుకొని కేంద్రానికి సిఫారసు చేయవచ్చు. తర్వాత రాష్ట్రపతి ఆ వ్యక్తిని న్యాయమూర్తిగా నియమిస్తారు. అలా నియమితులైనవారు సీఎం ప్రభావానికి లోనవుతారని ఎవరైనా అనగలరా? లేదా ఆయన స్వతంత్రులు కారని చెప్పగలరా? చెప్పలేరు. వాళ్ల అర్హతలను కొలీజియం పరిశీలించి సిఫారసు చేస్తుంది కాబట్టి అలా అనడానికి వీల్లేదు. అదే తరహాలో గవర్నర్ మొత్తం 11 మంది ఐఏఎస్ అధికారుల పేర్లను పరిశీలించి నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించారు’ అని తీర్పులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
HIGH COURT ON SEC: గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన అనుభవం ఉందా..?: హైకోర్టు