రాష్ట్ర ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తూ... జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకునే వరకు తాము ఉద్యమిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిర్భయంగా బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం లేకుండా... చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో మీడియా స్వతంత్రతను దెబ్బతీసేలా నిర్ణయాలు చేయడం ఆక్షేపణీయమని మాజీ మంత్రులు దేవినేని ఉమ పేర్కొన్నారు.
విజయవాడ నగరంలోని తెదేపా కార్యాలయంలో కేబినెట్ నోట్ ప్రతులను తగలబెట్టి తమ నిరసన తెలిపారు. అక్టోబర్16వ తేదీని రాష్ట్ర చరిత్రలో చీకటిరోజుగా అభివర్ణించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యతిరేకంగా కథనాలు రాసే వారిపై కేసులు నమోదు చేసేలా ఉత్తర్వులు తెచ్చారని... వాటికి నగిషీలు చెక్కి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మీడియా గొంతు నొక్కేలా వ్యవరిస్తున్నారని ధ్వజమెత్తారు.
సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తనకు వ్యతిరేక మీడియా అంటూ... కొన్నింటిపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ద్వారా అప్పటి నుంచే తన బెదిరింపు దోరణి కనబరుస్తూ వచ్చారన్నారు. మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తే... తమ అవినీతికి అడ్డు ఉండదనే భావనతో ముఖ్యమంత్రి ఉన్నారని ఆరోపించారు. చేనేత కార్మికుల విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుపైనా వ్యక్తిగతంగా బురద జల్లితే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... 'ఉగాది నాటికి పేదలందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు'