ఆర్మీ అధికారులంటే అందరికీ గౌరవం. ఇదే అవకాశంగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ సైట్లలో వస్తువులు విక్రయాలకు ఉంచి ఆర్మీ అధికారులమంటూ నమ్మించి .. అమాయకులను నట్టేట ముంచుతున్నారు. సైబర్ కిలాడీలు తాజాగా కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన ఓ యువకుడి జేబులు ఖాళీ చేశారు. గన్నవరానికి చెందిన ఓ యువకుడు ఆన్లైన్ సైట్లో ఏసీ కొనాలని నిర్ణయించుకున్నాడు. 10 వేల రూపాయలకే ఏసీ వస్తుందనే ప్రకటన చూసి వారితో ఫోన్లో మాట్లాడాడు.
ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నానని.. తన పేరు శ్యామ్ కుమార్ అని నిందితుడు తెలిపాడు. బదిలీ పై వేరే ప్రాంతానికి వెళుతున్నానని... అందుకే అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నానని నమ్మించాడు . ఆర్మీ దుస్తులతో ఉన్న ఫొటో, ఐడీకార్డును సైతం మెయిల్‌కు పంపాడు. ఏసీని డెలివరీ చేశానని ఓ రశీదును సైతం పంపాడు. నిందితుని మాటలు నమ్మిన యువకుడు పేటీఎం ద్వారా మూడు వేల రూపాయల నగదు జమచేశాడు.
నగరానికి చెందిన మరో మహిళ ఇదే తరహాలో 20 వేల రూపాయల నగదును నిందితుని ఖాతాలో జమ చేసింది. కారు, రిఫ్రిజిరేటర్, ఏసీ లాంటి వస్తువులను ఎరవేసి ..ఆర్మీ అధికారుల ముసుగులో నకిలీ ఐడీ కార్డులు సృష్టించి అమాయకుల నగదు దోచేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెపుతున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ తరహా 16 కేసులు నమోదు అయ్యాయని ఇన్స్‌స్పెక్టర్ చెపుతున్నారు. మరికొన్ని ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయన్నారు.
ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేటప్పుడు, విక్రయించేటప్పుడు పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని పోలీసులు చెబుతున్నారు. వస్తువు డెలీవరీ అయిన తర్వాతనే నగదు జమ చేయాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి..