సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై రాజమహేంద్రవరం కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఆయనతో పాటు సహకార శాఖ మాజీ అధికారి గురునాథానికి హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి సిటి స్కాన్ తీయించగా.. కొవిడ్ పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యుల కోరిక మేరకు గురువారు తెల్లవారుజామున ధూళిపాళ్లను జైలు అధికారులు విజయవాడ ఆయుష్ ఆస్పత్రికి తరలించారు.
సంగం డెయిరీ అక్రమాల ఆరోపణలపై అరెస్టైన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కొవిడ్ సోకింది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న ధూళిపాళ్లకు కొవిడ్ సోకినట్టు బుధవారం రాత్రి జైలు అధికారులు వెల్లడించారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయనకు మంగళవారం జైలులోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. వాటి ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. దీంతో నరేంద్రతో పాటు సహకార శాఖ మాజీ అధికారి గుర్నాథాన్ని బుధవారం రాజమహేంద్రవరంలోని ఏసీబీ కార్యాలయానికి తరలించి అధికారులు 6 గంటల సేపు విచారించారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు జైలు అధికారులకు అప్పగించారు. కొవిడ్ లక్షణాలు పెరగడంతో ఇద్దరికీ ప్రైవేటు కేంద్రంలో సీటీ స్కాన్ పరీక్షలు చేయించగా.. కొవిడ్ నిర్ధరణైందని జైలు సూపరింటెండెంట్ తెలిపారు.
బెయిల్‌పై హైకోర్టులో వాదనలు
నిందితుల బెయిలుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్లపై అనిశా కోర్టు విచారణ జరిపేందుకు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ అడ్డంకి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. సంగం డెయిరీ విషయంలో అనిశా నమోదు చేసిన కేసును కొట్టేయాలని ధూళిపాళ్ల నరేంద్రకుమార్, డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అనిశా తరఫు న్యాయవాది గాయత్రీరెడ్డి.. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. కరోనా పరిస్థితుల్లో జైల్లో ఉన్న నిందితులు పడుతున్న అవస్థల గురించి వివరించారు. నరేంద్ర, గురునాథాన్ని ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించాలని అనిశా కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ గురువారానికి వాయిదా పడిందన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని తగిన ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఐసీయూలో ఎండీ గోపాలకృష్ణన్
మరోవైపు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌ను ఐసీయూ వార్డుల్లో చేర్చినట్లు విజయవాడ ఆయుష్ ఆస్పత్రి వైద్యులు.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజారావుకు సమాచారం ఇచ్చారు. ఏసీబీ కోర్టు ఆదేశాలతో ఆయన్ను మెరుగైన వైద్య సేవల నిమిత్తం మంగళవారం అర్ధరాత్రి ఆయుష్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై బుధవారం జైలు అధికారులకు నివేదిక పంపారు. గోపాలకృష్ణన్ ఓ మోస్తరు తీవ్రత ఉన్న వైరల్ బ్రాంకో న్యుమోనియాతో బాధపడుతున్నారని.. బయటి నుంచి ఆక్సిజన్ అందిస్తున్నట్లు నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'