థియేటర్లు నడిస్తేనే డిస్ట్రిబ్యూటర్లకు ఆదాయం. స్టార్ హీరోల నుంచి జూనియర్ ఆర్టిస్టులు వరకూ..బ్రతకాలంటే ప్రేక్షకుడు ధైర్యంగా సినిమా చూడగలగాలి...కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు..షూటింగ్ లకు అనుమతి వచ్చినా.. ఊహించిన స్థాయిలో.. సినిమాలు పూర్తి కావటంలేదు. పూర్తయిన సినిమాలు ..విడుదల చేసేందుకు.. థియేటర్లు తెరిచిలేవు. వంద రోజులకు పైగా మూసి ఉండటంవల్ల.. కొందరు యజమానులు అప్పులతో సతమతమవుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల వద్ద నుంచి సినిమాలు కొని.. వాటి మీద వచ్చిన ఆదాయాన్ని చెల్లిస్తారు. మరి కొందరు బైట రుణాలు తీసుకుని సినిమాలు కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా థియేటర్లు మూతపడటం యజమానులను కోలుకోలేని దెబ్బతీసింది.
థియేటర్లకు ముఖ్యంగా విద్యుత్ అవసరం అయితే..అవి నడిచినా నడవక పోయినా కనీస చార్జీలు చెల్లించాల్సిందే. అయితే యజమానుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని మాఫీ చేసింది. దీంతో అక్కడ వారికి కొంత ఊరట లభించింది. కానీ తెలంగాణ సర్కారు దీనిపై ఎలాంటి హామీ ఇవ్వకపోడం వల్ల లక్షల్లో బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అద్దెలు కట్టలేక అగచాట్లు...
మరో వైపు కరోనా వ్యాప్తి సమయంలో తమవంతు సాయంగా ప్రభుత్వానికి నిధులు కూడా పంపారు థియేటర్ల యాజమాన్యాలు. కాని ఇప్పుడు వారి పరిస్థితే బాగాలేకపోవడం వల్ల ప్రభుత్వాలు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు. సాయం చేయకపోయినా కనీస చార్జీలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి పలు విధాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరో వైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 17వందలకు పైగా ఉన్న థియేటర్లలో సగానికి పైగా లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. వీరి పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. అటు అద్దెలు, ఇటు జీతాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందుల ఎదుర్కుంటున్నారు. వీరి బాధలను అర్థం చేసుకున్న కొందరు యజమానులు అద్దెలు సైతం తీసుకోవటంలేదు.
ప్రభుత్వ స్పందన కోసం ఎదురు చూపులు..
ఇన్నికష్ఠాలు ఎదుర్కొంటున్నప్పటికీ..ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తే తప్ప థియేటర్లు తెరవబోమని అంటున్నారు. థియేటర్లు తెరవడం వల్లే కరోనా వ్యాప్తి చెందిందన్న చెడ్డ పేరు తమకు వద్దని యజమానులు చెబుతున్నారు. మరో వైపు ఆర్ధిక కష్టాల నుంచి గట్టక్కడానికి ప్రభుత్వం కనీస విద్యుత్ బిల్లులు మాఫీ చేయడంతో పాటు పార్కింగ్ ఫీజులకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు.సినిమా ధియేటర్లు మూతపడడం గతంలో కూడా జరిగినా.....ఇన్నాళ్లు మూతపడడం మాత్రం ఎప్పుడూ లేదు. వ్యాక్సిన్ వచ్చి మహమ్మారి... ఖతమైయ్యేవరకూ సినిమా హాళ్లు తెరుచుకోవనే అంతా అంటున్నారు.
గతంలో కొందరు థియేటర్ల ద్వారా నష్టాలు వస్తే వాటిని ఫంక్షన్ హాళ్లుగా మార్చే వారు ఇప్పుడా ఆపరిస్తితి కూడా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు పూర్వ వైభవం పొందడం మాట అటుంచితే వాటి ఉనికిని కాపాడుకోడం చాలా ముఖ్యంగా భావిస్తున్నారు యాజమానులు. అందుకే ప్రభుత్వం తరఫునుంచి తమను ఆదుకునే విధంగా ఏవైనా ప్యాకేజీలు ప్రకటిస్తే బాగుంటుందని కోరుతున్నారు.
ఇవీ చదవండి: కరోనా కాటుతో వెలవెలబోతున్న వెండితెర