Corona effect on Gangireddulu : సంక్రాంతి వచ్చిందంటే చాలు.. నెలరోజుల ముందు నుంచే ఇంటిముందు అందమైన రంగవల్లులు, గొబ్బెమ్మలకు తోడు హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటపాటలతో తెలుగుదనం ఉట్టిపడుతుంది. తరాలుగా వస్తున్న సంప్రదాయాల్లో నేటికీ కనిపిస్తోంది గంగిరెద్దులే. ప్రత్యేక వేషధారణతో ఎద్దును అలంకరించుకుని డోలు కొడుతూ.. సన్నాయి ఊదుతూ ఇంటిముందుకు వచ్చే గంగిరెద్దులు ఆడించే వారికి.. బియ్యం, పిండివంటలు, కొంత నగదు దానమిస్తారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ మూడురోజులు తప్పకుండా గంగిరెద్దులు ఆడించే వారు ప్రతి ఇంటి ముందుకూ వస్తారు.
ఇంటిముందుకు వెళ్లినా.. దానం ఇవ్వటం లేదు..
కాలానుగుణంగా ఎన్నో కులవృత్తులు కనుమరుగవుతున్నా.. ఇప్పటికీ తెలుగు సంప్రదాయ కళను బతికిస్తున్నారు గంగిరెద్దులవారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన సుమారు 30 కుటుంబాలు గంగిరెద్దుల ద్వారా ఏటా జనవరి నుంచి మహాశివరాత్రి వరకు గ్రామ గ్రామాలు తిరుగుతూ దానం ఇచ్చిన వాటితో పొట్టనింపుకుంటున్నారు. గతంలో సంక్రాంతి మాసం కష్టపడితే ఏడాదికి సరిపడా తిండిగింజలు వచ్చేవి. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంటిలోనూ పశువులు ఉండటంతో.. గంగిరెద్దులపై ప్రేమతో పెద్దఎత్తున దానం ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. రెండేళ్లుగా ఆంక్షల నేపథ్యంలో బయట తిరగడం కుదరలేదంటున్నారు. ఒకవేళ ఇంటిముందుకు వెళ్లినా కరోనా భయంతో ఎవరూ బయటకు వచ్చి దానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. కొన్నిచోట్ల అసలు గ్రామాల్లోకే రానివ్వడం లేదని తెలిపారు. సంప్రదాయ కళను బతికిస్తున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని గంగిరెద్దులు ఆడించే వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: Cockfight In AP: పండగ జోరు.. కోడి పందేల హోరు