విజయవాడ న్యాయస్థానాల ప్రాంగణంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(state human rights commission) ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళవారం పాత కేసులు 25తో పాటు, కొత్తగా 22 ఫిర్యాదులు విచారించగా, 13 కేసులను పరిష్కరించారు. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు డాక్టర్ గొచిపాత శ్రీనివాసరావు ఫిర్యాదులు స్వీకరించారు.
మచిలీపట్నానికి చెందిన ఓ విద్యార్థి విజయవాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుకునేటప్పుడు తల్లిదండ్రులు చనిపోయారు. ఫీజు బాకీ ఉండటంతో ఇంటర్ ధ్రువపత్రాలు ఇవ్వబోమని కళాశాల యాజమాన్యం తెగేసి చెప్పింది. కనీసం ఫీజు ఎంత చెల్లించాలో కూడా తెలపకుండా, తనను వేధిస్తున్నారంటూ ఆ విద్యార్థి హెచ్ఆర్సీకి పోస్టులో ఫిర్యాదు పంపగా.. మంగళవారం కేసును విచారించారు. ఛైర్మన్ మాట్లాడుతూ.. ఈ కేసుకు సంబంధించి ఎన్నిసార్లు సమాచారం పంపినా సరైన సమాధానం ఇవ్వలేదని, ఫీజుల విషయంలో కళాశాలలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, పద్ధతి మార్చుకోవాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఆ విద్యార్థి ఫీజు బకాయి రూ.23 వేలను సభ్యుడు గొచిపాత శ్రీనివాసరావు చెల్లించి, సర్టిఫికెట్లు ఇప్పించారు.
హత్య కేసుపై ఫిర్యాదు
పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లిలో జరిగిన గడ్డం శ్రీనివాస్(23) హత్యను కొందరు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దళిత వర్గాల ఫెడరేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు బూదాల సౌమ్య, ఎమ్మార్పీఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు బూదాల సలోమి, న్యాయవాది గోపె శ్రీకాంత్‌లు ఫిర్యాదు చేశారు. ఈ మరణాన్ని హత్య కేసుగా నమోదు చేయించి, మృతదేహానికి రీపోస్టుమార్టం చేసి, నిందితులను శిక్షించాలని కోరారు.
ఇదీ చదవండి:
HIGH COURT: పంచ్ ప్రభాకర్‌ను 10 రోజుల్లో అరెస్టు చేయాల్సిందే