CM Jagan Review On Rural Development: రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, మరమ్మతులకు నిధుల కొరత లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లను పూర్తిగా గాలికొదిలేశారని, తమ ప్రభుత్వం వచ్చాక రెండేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో అవి దెబ్బతిన్నాయని అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి సమీక్షించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ రహదారుల నిర్వహణ, వైఎస్సార్ జలకళ, స్వచ్ఛ సంకల్పం, జగనన్న కాలనీల్లో పనుల పురోగతిని సమీక్షించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
భవన నిర్మాణాల్లో వేగం పెరగాలి
‘ఉపాధి హామీ పథకంలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లీనిక్‌లు, డిజిటల్ లైబ్రరీ భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రాధాన్యమివ్వాలి. అమూల్ సంస్థ పాలు సేకరిస్తున్న జిల్లాలు, ప్రాంతాల్లో పాల శీతలీకరణ కేంద్ర భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలి. నరేగాలో కేంద్రం నుంచి వస్తున్న నిధులను ప్రాధాన్య క్రమంలో గుర్తించిన పనులకు వెచ్చించాలి’ అని సీఎం ఆదేశించారు. తన పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులను చూసినపుడు ఆవేదన కలిగిందని గుర్తుచేసిన జగన్.. గ్రామీణ ఆవాస ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలని ఆదేశించారు. ‘వైఎస్సార్ జలకళలో అసెంబ్లీ నియోజకవర్గానికో రిగ్గును సమకూర్చుకోవాలి. తద్వారా రైతుల భూముల్లో బోర్ల తవ్వకం ఓ క్రమపద్ధతిలో సాగుతుంది. బోరు తీసిన వెంటనే మోటారు బిగించాలి. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలి. తాగునీటి పథకాల నిర్వహణలో ఇబ్బందులను అధిగమించాల’ని ఆదేశించారు.
61.5% ఇళ్ల నుంచి చెత్త సేకరణ
గ్రామాల్లో 61.5% ఇళ్ల నుంచి ప్రస్తుతం చెత్త సేకరిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబరు కల్లా పూర్తిగా లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో మురుగు నిల్వ ఉన్న 582 గ్రామీణ ప్రాంతాలను సర్వేలో గుర్తించామని, వివిధ సాంకేతిక పద్ధతుల్లో మురుగు నీటి శుద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ పనులు ఏడాదిలో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. గ్రామాల్లో సామాజిక ప్రజారోగ్య కాంప్లెక్సుల నిర్వహణపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఉపాధి హామీ పనుల్లో గ్రామ సచివాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండేళ్లుగా వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. అన్ని రహదారులకు ఒకేసారి మరమ్మతులు చేపట్టాల్సి వస్తోంది. జగనన్న కాలనీల్లో మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలి. -జగన్, ముఖ్యమంత్రి
ఇదీ చదవండి
Botsa On PRC: కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స