భూముల క్రయ విక్రయాల సమగ్ర డేటాను ఎప్పటి కప్పుడు రికార్డుల్లో అప్‌డేట్ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా భూముల సమగ్ర సర్వేను పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై సంబంధిత అధికారులతో జగన్ సమీక్షించారు. భూముల క్రయ విక్రయాలు జరిగినప్పుడు అమ్మిన, కొనుగోలు చేసిన వ్యక్తుల రికార్డుల్లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. క్రయ విక్రయాల సమగ్ర డేటాను అప్‌డేట్ చేశాకే రిజిస్ట్రేషన్ పూర్తైనట్లు భావించాలన్నారు.
న్యాయపరమైన అంశాల్లో అనుభవం ఉన్నవారితో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలన్నారు. ఆ బృందం సిఫార్పుల ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియలపై ఎస్‌ఓపీలు రూపొందించాలని.. గ్రామ సచివాలయాల్లోనే మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. ల్యాండ్ సర్వే పూర్తి చేయడానికి తగినన్ని డ్రోన్లతో పాటు మిగిలిన సాంకేతిక పరికరాలు సమకూర్చుకోవాలన్నారు. డేటా భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఏటా ఒక వారంలో ల్యాండ్ రికార్డుల అప్‌డేషన్ చేపట్టాలని, దీనిపై తగిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
22(ఏ) భూములకు చెక్ పెట్టాల్సిందే..
22(ఏ) కింద ఉన్న నిషేధిత భూములను కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు జరగడం సహా వెలుగులోకి వచ్చిన అవకతవకలపై సీఎం చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల అంశానికి సంబంధించి రికార్డుల్లో చోటు చేసుకున్న వ్యవహారాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. "22(ఏ)కి సంబంధించి అనేక వ్యవహారాలు బయటకు వస్తున్న దృష్ట్యా ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరావృతం కాకుండా.. నిపుణులు, విశ్లేషకులతో చర్చించి మార్గదర్శకాలు రూపొందించాలి. దీనికి సంబంధించి ఆధీకృత వ్యవస్థను సైతం బలోపేతం చేయాలి అని సీఎం జగన్ ఆదేశించారు.
51 గ్రామాల్లో సర్వే పూర్తి
శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం కింద ఇప్పటి వరకు 51 గ్రామాల్లో సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. డిసెంబర్ నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తవుతుందని వెల్లడించారు. వారు సీఎంకి వివరించిన అంశాలివీ..
- 2022 జూన్ నాటికి 2,400 గ్రామాల్లో, ఆగస్టు నాటికి మరో 2,400 గ్రామాలు, అక్టోబర్‌కి మూడు వేల గ్రామాలు, డిసెంబర్‌కి ఇంకో 3వేల గ్రామాలు, 2023 మార్చి నాటికి 3వేల గ్రామాలు, జూన్ నాటికి మరో 3వేల గ్రామాల చొప్పున రాష్ట్రమంతటా సర్వే పూర్తవుతుంది.
- ప్రయోగాత్మకంగా చేపట్టిన 51 గ్రామాల్లో 30,679 కమతాల సర్వే పూర్తి. 3,549 మంది పట్టాదారుల వివరాల నవీకరణ.
- రెవెన్యూ విభాగానికి వచ్చిన 572, సర్వే విభాగానికొచ్చిన 1,480 అభ్యర్థనలు సహా 235 సరిహద్దు వివాదాల పరిష్కారం. రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తి.
ఇదీ చదవండి..