ఆపదలో ఉన్న మహిళలు, యువతులను ఆదుకునేందుకే దిశ యాప్‌ను తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో ఏడాదిన్నర క్రితం దిశ అనే యువతి అత్యాచారం, హత్య జరిగిందని సీఎం జగన్ గుర్తుచేశారు. మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా దిశ చట్టం, యాప్, ప్రత్యేక స్టేషన్లను తెచ్చామన్నారు. మహిళలు సురక్షితంగా ఉండేలా ఇవి తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గొల్లపూడి కార్యక్రమంలో...
కృష్ణాజిల్లా గొల్లపూడిలో మంగళవారం జరిగిన దిశ యాప్ సామూహిక డౌన్‌లోడ్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్(CM JAGAN) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా పోలీసులు, వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి మహిళల స్మార్ట్‌ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించి, ఎలా వినియోగించుకోవాలో ప్రత్యక్షంగా చూపించాలన్నారు. ఆపద సమయంలో అది వారికి ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల ప్రకాశం బ్యారేజి వద్ద మహిళపై సామూహిక అత్యాచారం ఘటన చోటుచేసుకుందని గుర్తు చేశారు. బయటకు వెళ్లిన ఆడపిల్లకు ఇలాంటి ఆపద ఎదురైతే రక్షణ కోసం ఉపయోగపడేలా దిశ యాప్‌ను రూపొందించామని వివరించారు. ఈ యాప్‌కు నాలుగు అవార్డులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు 17లక్షల డౌన్‌లోడ్లు వచ్చాయన్నారు. వీటి సంఖ్యను కనీసం కోటికి చేర్చాలన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. మొబైల్‌లో ఇది ఉంటే.. మీ అన్నయ్య తోడు ఉన్నట్లుగా భావించాలన్నారు. ఎస్‌ఓఎస్ అనే ఆప్షన్ టాప్ చేస్తే.. బాధితులు ఉన్న ప్రాంతానికి నిమిషాల వ్యవధిలో పోలీసులు చేరుకుంటారన్నారు. ఫోన్ నుంచి కాల్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడి నుంచి సంబంధిత స్టేషన్‌కు, తిరిగి మహిళ వద్దకు వచ్చేలా కార్యాచరణ ప్రణాళికను తయారు చేశామన్నారు. యాప్‌లో బటన్ నొక్కే సమయం లేకపోతే, ఫోన్‌ను అటూ ఇటూ కదిపినా పోలీసులకు సమాచారం అందుతుందన్నారు.
* యాప్ తయారీలో ప్రత్యేకాధికారులు దీపిక, కృతికా శుక్లా ఎంతో తోడ్పాటు అందించారని ప్రశంసించారు. మహిళలు ప్రయాణం చేస్తున్నప్పుడు.. ఆపదలో ఉన్నట్లు అనుమానం వస్తే, యాప్‌లో ‘ట్రాక్ మై ట్రావెల్’(TRACK MY TRAVEL) అన్న ఆప్షన్‌ను క్లిక్ చేయాలని సీఎం జగన్ సూచించారు. దీనివల్ల ఆమె వెళ్తున్న మార్గం సమాచారం కంట్రోల్‌రూమ్‌లో రికార్డు అవుతుందన్నారు. అప్పుడు పోలీసులు సత్వరం స్పందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి పోలీసు యూనిట్‌కు ఒకటి చొప్పున 18 దిశ పోలీసుస్టేషన్లను(DISHA POLICE STATIONS) ప్రారంభించామన్నారు. వీటితోపాటు చట్టాన్ని ఇంకా ఉపయోగకరంగా ఉండేలా చూసేందుకు, కేంద్ర ప్రభుత్వానికి పంపించామన్నారు. అక్కడి నుంచి ఇంకా ఆమోదం రాలేదని, అందువల్ల పూర్తిస్థాయిలో చట్టాన్ని తీసుకురాలేకపోయామన్నారు. సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టులను తీసుకొస్తామని, దీనికోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతున్నామని వివరించారు. ఇవి త్వరలోనే వాస్తవ రూపం దాలుస్తాయని ఆశిస్తున్నామన్నారు.
వలంటీర్లు, మహిళా పోలీసులతో మాటామంతీ
కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళా పోలీసులు, గ్రామ వలంటీర్లతో సీఎం మాట్లాడారు. వారు తమ అనుభవాలను ఆయనతో పంచుకున్నారు. తమ పరిధిలోని క్లస్టర్‌లో 15 ఏళ్లు నిండిన అమ్మాయిల స్మార్ట్‌ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నామని వివరించారు. ప్రతి గడపకూ వెళ్లి మహిళలందరితో డౌన్‌లోడ్ చేయించడమే కాకుండా.. వినియోగించేలా చూస్తామని చెప్పారు. దీని ఉపయోగాలను అందరికీ వివరించాలన్నారు.
పనితీరు ప్రత్యక్ష పరిశీలన..
యాప్ డౌన్‌లోడింగ్‌లో ఏమైనా సమస్యలున్నాయా? అని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే, వాటిని తదుపరి వెర్షన్లలో సరి చేస్తామన్నారు. ఈ సందర్భంగా దిశ ప్రత్యేకాధికారి దీపికా పాటిల్ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో వివరించారు. సీఎం జగన్.. తనకున్న సందేహాలను ఆమెను అడిగి నివృత్తి చేసుకున్నారు. తర్వాత సభకు వచ్చిన మహిళలు, విద్యార్థుల ఫోన్లలో యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు. అనంతరం దీని పనితీరు తెలుసుకునేందుకు ఓ మహిళను వేదికపైకి పిలిపించి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ మహిళ ఎస్‌ఓఎస్(SOS) బటన్ నొక్కగానే కంట్రోల్ రూమ్ నుంచి ఆ నంబరుకు ఫోన్ వచ్చింది. అక్కడి నుంచి సమాచారాన్ని భవానీపురం పోలీసుస్టేషన్‌కు అందించారు. వెంటనే స్టేషన్ నుంచి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. యాప్ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. యాప్‌లో త్వరలో మరిన్ని హంగులు జోడిస్తున్నట్లు దిశ ప్రత్యేకాధికారి దీపికా పాటిల్ వివరించారు. మహిళలపై ఎక్కువ నేరాలు జరిగే ప్రాంతాలను మార్కింగ్ చేయడం వల్ల.. ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్‌కు అలర్ట్ వస్తుందన్నారు. యాప్ స్టోర్‌లో దిశ పేరుతో చాలా యాప్‌లు ఉన్నాయని, మహిళలు గందరగోళానికి గురికాకుండా వీటిని తొలగించేలా చూడాలని దీపికా పాటిల్‌ను సీఎం ఆదేశించారు.
మహిళా ముఖ్యమంత్రి అంటూ జగన్ తడబాటు..
సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మహిళలకు మేలుచేసే విషయంలో మా ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే.. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి..’ అని తడబడి, తర్వాత సవరించుకున్నారు. రాష్ట్ర హోంమంత్రి మహిళ అని, దళితురాలైన సుచరితకు(SUCHARITHA) ఈ పదవి ఇచ్చామన్నారు. ఆమె దిశ యాప్ రూపకల్పనలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని వివరించారు. అట్టడుగువర్గాల్లో విశ్వాసం నింపేందుకే ఈ విషయాన్ని చెబుతున్నానన్నారు.
ఇదీ చదవండి:
ప్రజల ఆరోగ్యం పట్టించుకోకుండా..తప్పుడు కేసులపైనే దృష్టి: చంద్రబాబు