NITI Aayog Meeting: నీతిఆయోగ్ పాలకమండలి సమావేశంలో.. వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో 62 శాతం మంది జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35 శాతం పైనే ఉందని జగన్ తెలిపారు. అందుకే వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, వడ్డీలేని రుణాలు, 9 గంటల ఉచిత విద్యుత్ తదితర పథకాలు, రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామని వివరించారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు. పంటల కొనుగోలు ప్రక్రియను సీఎం యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్బీకేల స్థాయిలో ఈ–క్రాప్ బుకింగ్, ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన, సూచనల కోసం శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు.
బడికెళ్లటం, చదువుకోవడం చిన్నారుల హక్కుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాలలు మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు జీఈఆర్ నిష్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం తెలిపారు. పేదరికం పిల్లల చదువులకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో "అమ్మ ఒడి" పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు చేసినట్లు వివరించారు. బైజూస్ యాప్ ద్వారా నాణ్యమైన పాఠ్యాంశాలు అందిస్తున్నామన్నారు. 8 వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ కూడా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. నాడు–నేడు పథకం కింద 55 వేల 555 స్కూళ్లలో 17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నామని సీఎం వివరించారు.
గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు విద్యాదీవెన పథకం ద్వారా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందారని వివరించారు. పౌరుల ఇంటి వద్దకే సేవలందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 11 వేల 162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఉపాధి కల్పించడమే కాకుండా, అవినీతి లేకుండా, పారదర్శకంగా సేవలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టామన్నారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి ఒక నోట్‌ను కూడా సమావేశంలో సీఎం సమర్పించారు.
ఇవీ చూడండి