BRIDGE విజయవాడ నగరంలో కీలకమైన చనుమోలు వెంకటరావు పైవంతెన గుంతలు పడి ..చువ్వలు లేచి ప్రమాదకరంగా ఉంది. కబేళా కూడలి నుంచి ఇన్నర్ రింగ్‌రోడ్డు , పాయకాపురం, వెలగలేరు, మైలవరం వైపు వెళ్లాలంటే ఈ వంతెన దాటాల్సిందే. రోజూ ఎంతో మంది విద్యార్థులు, మహిళలు, వాహన చోదకులు దీనిపై నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా.. రాత్రి వేళలో గుంతలు కనిపించక తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. నాణ్యత లేని పనులే పైవంతెన దుస్థితికి కారణమని.. జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పసిపిల్లలతో ప్రయాణించాలంటే భయమేస్తోందంటున్నారు.
గుంతలు, చువ్వలు పైకితేలడం వల్ల ఆటోలు, ద్విచక్ర వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు వాపోతున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడలోకి ప్రవేశించే రెండు ప్రధాన మార్గాల్లో.. చనుమోలు వెంకట్రావు పైవంతెన కూడా ఒకటి . దుర్గమ్మ ఆలయం వద్ద పైవంతెన పూర్తి కాకముందు.. ఇదే పెద్ద వంతెనగా ఉండేది. డిజైన్ పరంగా అరుదైనది.
ఆకాశం నుంచి చూస్తే సాలె పురుగు ఆకారంలో కనిపించడంతో.. దీన్ని స్పైడర్ ఫ్లైవోవర్‌గా పిలిచేవారు. నూజివీడు, విస్సన్నపేట ప్రజలు నగరానికి రావడం దుర్లభంగా మారడంతో 2009లో దీని పనులు ప్రారంభించారు. 2011 నాటికి నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ పైవంతెనపై ప్రయాణమంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇవీ చదవండి: