దళితులపై దాడుల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విజయవాడలో అంబేడ్కర్ విగ్రహ శంకుస్థాపన పేరుతో.. వైకాపా ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని.. తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దళితుల అసైన్డ్ భూములు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు. గురజాలలో విక్రమ్‌ను హత్యచేశారని, విశాఖలో డాక్టర్ సుధాకర్‌ను సస్పెండ్ చేసి నడిరోడ్డుపై లాఠీలతో కొట్టించారని ఆయన ఆరోపించారు. చిత్తూరులో డాక్టర్ అనితారాణిని వేధించారని, మాజీ ఎంపీ హర్షకుమార్‌ను, రాజేశ్‌ను జైళ్లకు పంపారని మండిపడ్డారు. దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వీటన్నింటి నుంచి దృష్టి మళ్లించేందుకే ఇప్పుడీ విగ్రహం డ్రామా మొదలుపెట్టారని విమర్శించారు.
అమరావతిలో అంబేడ్కర్ స్మృతి వనం అభివృద్ధి చేస్తే తెదేపాకు పేరువస్తుందనే అక్కసుతో పనులు నిలిపేయడం దళిత ద్రోహమన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం మంచిదేనని.. దానితో పాటు అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం కూడా 26 ఎకరాల్లో అభివృద్ధి చేయాలన్నారు. రాజ్యాంగ నిర్మాత విగ్రహంతో పాటు, జగజ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి... : ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. కుటుంబసభ్యులకు దక్కని ఆఖరిచూపు