అధికారులకు చేతకాకుంటే రాజీనామా చేసి పోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం(chandrababu fire on officers) చేశారు. అందరు కలిసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తగలపెడతారా? అని మండిపడ్డారు. పోటీచేసే దమ్ముంటే ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. రౌడీయిజం, బెదిరింపులతో అరాచకాలు సృష్టించడం దుర్మార్గమని.. పులివెందుల రాజకీయాలు రాష్ట్రంలో సాగనివ్వమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికే తిరుగుబాటు మొదలైందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడిందని చంద్రబాబు ఆరోపించారు(chandrababu on local body elections). ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘నేను ప్రచారానికి వెళ్లకపోయినా కుప్పం ప్రజలు గెలిపించే వారు. రిటర్నింగ్ అధికారులు గతంలో అభ్యర్థులకు సహకరించేవారు. అధికారులు కూడా నామినేషన్లు ప్రోత్సహించేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. తెదేపా అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వెంకటేశ్‌ను బుల్లెట్‌తో ఢీకొట్టి అతని వద్ద ఉన్న పత్రాలు లాక్కెళ్లారు. పోలీసుల సాయంతో రెండో రోజు నామినేషన్ వేశారు. కానీ, తుది అభ్యర్థుల జాబితాలో వెంకటేశ్ పేరు తీసేశారు. అమర్నాథ్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఈడ్చుకెళ్లారు. అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే సాక్ష్యాధారాలతో దోషులుగా నిలబెడతాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చేశారు..
స్థానిక సంస్థల ఎన్నికలను ఓ ప్రహసనంగా మార్చేశారని చంద్రబాబు విమర్శించారు. పోలీసులే సెటిల్మెంట్లు చేస్తూ అరాచకానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 3గంటల వరకూ పోటీలో ఉన్న అభ్యర్థిని సాయంత్రానికి తీసేశారని పేర్కొన్నారు. కుప్పం 14వ వార్డు అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకోకపోయినా ఉపసంహరించినట్లు ప్రకటించారని తెలిపారు.
నామినేషన్లు విత్‌డ్రా చేసుకోలేదు: 14వ వార్డు అభ్యర్థులు
తెదేపా నేతలు తమను కిడ్నాప్ చేశారనేది అవాస్తవమని 14వ వార్డు అభ్యర్థులు(kuppam 14th ward tdp candidate)గా నామినేషన్ వేసిన ఎం.ప్రకాశ్, అతని భార్య తిరుమగళ్... చంద్రబాబు సమక్షంలో వివరించారు. కుప్పం నుంచి మంగళగిరి వచ్చిన వారు చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కుప్పంలో తాము నామినేషన్లు విత్‌డ్రా చేసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘నామినేషన్ వేసిన తర్వాత మేం సొంత పనిపై ఊరెళ్లాం. మమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు టీవీలో చూసి ఆశ్చర్యపోయాం. మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో సందేశం ద్వారా తెలిపాం. అకారణంగా మా నామినేషన్లు తిరస్కరించారు. మాకు న్యాయం చేయాలి. మా కుటుంబాన్ని వైకాపా నేతలు బెదిరించారు. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తాం’’ అని 14 వార్డు అభ్యర్థులు తెలిపారు.
చదువుకావాలని రోడ్డెక్కే దుస్థితి కల్పంచారు..
చరిత్ర ఉన్న ఎయిడెడ్ వ్యవస్థను ప్రైవేటీకరణ ఆపాలని విద్యార్థులు పోరాడటం తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు(chandrababu on aided schools). పొమ్మనలేక పొగపెట్టే రీతిలో ఎయిడెడ్ విద్యాసంస్థల పట్ల వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కొండనాలుకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్లు విద్యావ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఏనాడూ రోడెక్కని విద్యార్థులను సైతం ఆందోళన బాట పట్టించారని దుయ్యబట్టారు. తమ పిల్లలకు చదువుకావాలని తల్లిదండ్రులు ఆందోళన చేసే దుస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిడెడ్ వ్యవస్థను పునరుద్ధరించాలని డిమాండ్ చేయాలని.. లేకుంటే విద్యార్థులంతా తిరగపడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను తీవ్రంగా పరిగణించాలన్నారు.
ఇదీ చదవండి.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో జగన్ భేటీ.. వివాదాలపై కీలక నిర్ణయం