గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న ముఖ్యమంత్రి వారి పట్ల కంసుడిలా తయారయ్యారని మండిపడ్డారు. దిశ ఘటనపై నాడు సభలో హ్యాట్సాఫ్ కేసీఆర్ అన్న జగన్.. రాష్ట్ర ఘటనలపై ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. స్నేహలత హత్య ఘటనతో పాటు ఇతర సంఘటనలన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి పార్టీ తరఫున 2లక్షల రూపాయల సాయాన్ని చంద్రబాబు ప్రకటించారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఎస్సీ యువతి స్నేహలత హత్యను తీవ్రంగా ఖండించారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లి వాపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ జీవితమే ఒక ఫేక్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేయగా, అదే దిశ పోలీస్ స్టేషన్కు స్నేహలత తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదని విమర్శించారు. 19 నెలల్లో జరిగిన హత్యాచారాలు, ఆడబిడ్డలపై వేధింపులు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు.
- వైకాపా అరాచకాలకు అదుపులేదు
అనంతపురం జిల్లాలోనే వరుసగా మూడు సంఘటనలు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. తండ్రి చనిపోతే సానుభూతి కోసం ఓదార్పు యాత్రలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో కడప జిల్లాలో ఉండి, ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్లు అందుబాటులో ఉన్నా అనంతపురానికి ఎందుకు వెళ్లలేదని తెదేపా అధినేత నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయని.. వైకాపా అరాచకాలకు అడ్డు అదుపు లేదని ధ్వజమెత్తారు.
- ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి
స్నేహలత హత్య బాధ్యులతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైకాపా ఆటవిక పాలనలో ఎవరికీ రక్షణ లేదని విమర్శించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అని ప్రశ్నించారు. గొప్పలు చెప్తున్న డీజీపీకి శాంతిభద్రతలు సమర్థంగా అమలవుతున్నాయని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. స్నేహలత తల్లి మాదిరి రాష్ట్రంలో మరే తల్లీ బాధపడకుండా ప్రతిఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే అంతా కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలన్నారు. తాడో పేడో తేల్చుకుందాం అంటే తప్ప పోలీసులు దారికి రారని చంద్రబాబు అన్నారు. ఆడబిడ్డలకు న్యాయం జరగాలంటే ఒక్కో మహిళ వీరనారీలా పోరాడాలని పిలుపునిచ్చారు. స్నేహలత హత్య ఘటనను మళ్లించేందుకే జేసీ కుటుంబంపై దాడి చేశారని ఆక్షేపించారు.
- అప్పుడే జగన్ ఫేక్ వ్యక్తి అని తేలింది
ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం వైకాపాదని చంద్రబాబు మండిపడ్డారు. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసి రాజకీయ కక్షల కోసం వాడటం రాష్ట్రానికి చేటని విమర్శించారు. వివేకానందరెడ్డిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినప్పుడే జగన్ ఫేక్ వ్యక్తని తేలిపోయిందన్నారు. సమాజం కోసం పనిచేసిన నాయకుల విగ్రహాలు కూలగొట్టి రౌడీలు, నేరస్థుల విగ్రహాలు పెడతారా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో గౌతు లచ్ఛన్న విగ్రహాన్ని కూలగొడతాననటం దుర్మార్గమని మండిపడ్డారు. ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం అడిగితే నమ్మి పూనకం వచ్చినట్లు ఓట్లేస్తే.., ఆరోజు ముద్దులు పెట్టిన వ్యక్తి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ధ్వజమెత్తారు.
- పోలీసులు ప్రజల గురించి ఆలోచించండి
నేరస్థుల చరిత్ర తెలిసిన జగన్ రెడ్డి దేశభక్తుల చరిత్ర కూడా తెలుసుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం పోరాడిన గౌతు లచ్ఛన్న విగ్రహాన్ని పడగొడతామని బయటకు వస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. పోలీసులు ఉద్యోగాల కోసం కాకుండా ప్రజల ప్రాణాల గురించి ఆలోచించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలంతా స్నేహలతకు జరిగిన అన్యాయంపై పోరాడాలని పిలుపునిచ్చారు. మన కుటుంబంలో జరిగితే ఎంతటి బాధో ఆలోచించి ప్రజలంతా చైతన్యవంతులు కావాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ప్రజలు రోడ్డెక్కి నినదిస్తే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం జరగదన్నారు.
ఇదీ చదవండి:
తాడిపత్రిలో ఉద్రిక్తత... జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి...