Polavaram: పోలవరం ప్రాజెక్టును బలి చేసింది వైకాపా ప్రభుత్వమేనని తెదేపా మొదటి నుంచీ చెబుతున్న విషయాన్నే ఇప్పుడు హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం ధ్రువీకరించిందని, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనే పోలవరంలో విధ్వంసం జరిగినట్లుగా ఆ కమిటీ తేల్చిందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ ఘోర తప్పిదాలపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యూహం, సమన్వయం లేవని కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్టు 2020లోనే పూర్తికావాల్సి ఉండగా, 2024 వరకు గడువు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చెప్పిందని పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో సోమవారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై చర్చించారు. ‘గుత్తేదారును మార్చవద్దని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జల వనరులశాఖ రాసిన లేఖలను, చేసిన హెచ్చరికలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలవరం పాపంలో అన్ని వేళ్లూ జగన్ వైపే చూపుతున్నాయి’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముంపు బాధితులకు సహాయ, పునరావాసంపై జగన్ ఇచ్చిన హామీలు, పునరావాస కాలనీల నిర్మాణం ఏమయ్యాయని ప్రశ్నించారు. ముంపు గ్రామాల్ని 2014లో తన ప్రయత్నంతోనే ఆంధ్రప్రదేశ్‌లో చేర్చారని, ఇప్పుడు ఈ ప్రభుత్వ వైఖరితో అక్కడి ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘తెదేపా నిర్వహిస్తున్న రైతు పోరు సభల ద్వారా అన్నదాతల కష్టాలపై ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే అవకాశం లభిస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల పైనా తెదేపా పోరాటం కొనసాగుతుంది. ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు డబ్బులు చెల్లించలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
ముంపు బాధితుల కుటుంబాలకు రూ.10వేల పరిహారమివ్వండి
గోదావరి వరద బారినపడిన ప్రతి కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. దెబ్బతిన్న ఇంటికి తక్షణ సాయంగా రూ.50వేలిచ్చి.. ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున పరిహారమివ్వాలని డిమాండు చేశారు. వరికి హెక్టారుకు రూ.25వేలు, ఎకరాకు ఆక్వా, తమలపాకు పంటకు రూ.50వేల చొప్పున, అరటికి రూ.40వేల చొప్పున ఇవ్వాలని కోరారు. మరణించిన ఆవు, గెదేలకు రూ.40వేల చొప్పున అందించాలని సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం సీఎస్ సమీర్‌శర్మకు లేఖ రాశారు. ‘వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరకులు, ఆహార పంపిణీ కూడా సక్రమంగా జరగలేదు. వరదల అనంతరం రాకపోకలు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరణలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేదు. ఇప్పటికీ అనేక గ్రామాలు చీకట్లోనే ఉన్నాయి. కుటుంబానికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్, ఉల్లిపాయలు కిలో చొప్పున ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. శిబిరాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇస్తామన్న సాయం అందలేదు. కొన్నిచోట్ల రూ.వెయ్యి ఇచ్చారు. తెలంగాణలో రూ.10వేలు అందిస్తే రాష్ట్రంలో రూ.2 వేలతోనే సరిపెట్టారు’ అని లేఖలో పేర్కొన్నారు.
ఇవీ చూడండి