CBN ON YSRCP ATTACKS IN KUPPAM: చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తల దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కుప్పం దాడి ఘటనపై స్థానిక తెదేపా నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా కార్యకర్తల దాడిలో గాయపడిన లోకేశ్, శరవన్ లకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
స్థానిక క్వారీలలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకే వైకాపా నేతలు దాడులకు తెగబడుతున్నారని తెదేపా నేతలు మండిపడ్డారు. అక్రమ క్వారీలలో.. చంద్రబాబు పర్యటనపై అక్కసుతో వైకాపా దాడులు చేస్తోందని స్థానిక నేతలు అధినేత చంద్రబాబుకు వివరించారు. దాడిలో గాయపడిన బాధితుల ఆరోగ్య స్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు.
కుప్పంలో ఈ తరహా గొడవలు సృష్టించడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు యంత్రాగం స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుప్పం పర్యటన ముగిసిన రెండు రోజుల్లోనే దాడులు జరగడం పోలీసుల వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోందని ఆక్షేపించారు. ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: TTD: శ్రీవారి దర్శనం టోకెన్లు ముందుగా ఎలా ఇచ్చారు? భక్తుల ఆగ్రహం