బయో ఉత్పత్తుల అమ్మకాలపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఏటా రూ.వేల కోట్లలో సాగుతున్న ఈ వ్యాపారాన్ని నియంత్రించేందుకు షెడ్యూలు 6లో బయోస్టిమ్యులెంట్స్‌ను (జీవన ఉత్ప్రేరకాలు) చేర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి23 నుంచే వీటిని అమల్లోకి తెచ్చింది.
ఇప్పుడు ఆర్గానిక్
ప్రస్తుతం పంటల సాగుకు ఉపయోగించే పిచికారీ, ఎరువుల మందుల్లో బయో ఉత్పత్తుల అమ్మకాలు సగటున 30% వరకున్నాయి. అవి అటు పురుగు మందులు, ఇటు రసాయన ఎరువుల పరిధిలోకి రాకపోవడంతో చట్ట పరిధిలో లేవు. మొన్నటివరకు వీటిని బయో మందులని పిలిచేవారు. ఇప్పుడవే ఆర్గానిక్ అయ్యాయి. వీటిని చల్లితే మొక్కలు ఏపుగా పెరుగుతాయని, తెగుళ్లు రావని, అధిక దిగుబడి వస్తుందని వ్యాపారులు చెబుతారు. నిజానికి మార్కెట్లో దొరికే అధిక శాతం ఉత్పత్తుల్లో ఏముందో ఎవరికీ తెలియదు. డబ్బాలపైనా ముద్రించరు. పంటలపై చల్లితే ఫలితమెంతో దేవుడికే ఎరుక! వీటిని నియంత్రించాలని వ్యవసాయశాఖ పలు దఫాలుగా ప్రయత్నించినా వ్యాపారులు న్యాయస్థానాల్ని ఆశ్రయించి ఊరట పొందుతున్నారు.
* బయో ఉత్పత్తుల వ్యాపారం ఏటా రూ.వేల కోట్లలో సాగుతోంది. రైతుల పెట్టుబడులు పెరగడానికి ఇవీ ఒక కారణం.
* వరి, పత్తి, వేరుసెనగ, మిరప, కూరగాయలు, పండ్ల తోటలకు అధికంగా వీటిని వినియోగిస్తుంటారు. రాష్ట్రంలో ఏటా 1.50 కోట్ల ఎకరాల్లో పైర్లు వేస్తారు. సగటున ఎకరాకు రూ.2,000 చొప్పున లెక్కించినా ఏడాదికి రూ.3వేల కోట్ల వరకు వ్యాపారం సాగుతోంది.
* ఎకరం మిరప, పసుపు సాగుకు రూ.10వేలతో మందులు పిచికారి చేస్తే అందులో 30% మేర అంటే రూ.3వేల వరకు ఇవే ఉంటున్నాయి. పప్పుధాన్యాల పంటల్లోనూ సగటున రూ.వేయి వరకు వెచ్చిస్తున్నారు.
బయో మందులంటే..
సూక్ష్మజీవుల నుంచి తయారయ్యే మిశ్రమాలను బయో మందులుగా సవరించిన ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. సముద్రపు కలుపు మొక్కలు, వివిధ రకాల మొక్కలనుంచి జీవ సంబంధ పదార్థాలు, జీవ రసాయనాలు, ప్రొటీన్ హైడ్రోలైసేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కణరహిత సూక్ష్మజీవుల ఉత్పత్తులు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ట్రాన్సిపరెంట్లు, ఫల్విక్ ఆమ్లం.. వాటి ఉత్పన్నాలుగా వీటిని వర్గీకరించింది. మొక్కలపై, విత్తనాలకు, నేలలో మొక్కల రైజోస్పియర్ (వేరుచుట్టూ ఉండే ప్రాంతం)లో వినియోగిస్తుంటారు.
* మొక్కల జీవన ప్రక్రియల్ని ఉత్తేజపరచడం, పోషకాలు తీసుకునే సామర్థ్యం పెంచడం, బెట్టను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తుంటారు.
* వీటిలో 1968 చట్టం ప్రకారం నియంత్రించబడిన పురుగు మందులు ఉండకూడదు.
నాణ్యత నిర్ధారణ పరీక్షలు
తాజా ఆదేశాల ప్రకారం బయో ఉత్పత్తుల తయారీ/దిగుమతిదారులు.. తమ తయారీ యూనిట్ ఉన్న రాష్ట్రంలోని వ్యవసాయ డైరెక్టర్ నుంచి ఫాం-జీ2 తీసుకోవాలి. కేంద్ర ఎరువుల నియంత్రణాధికారి వద్ద నమోదు చేసుకుని ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ పత్రాన్ని తీసుకోవాలి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధీకృత సంస్థ నుంచి అనుమతి పొందాలి. బయోస్టిమ్యులెంట్ చట్టంలో భాగంగా ప్రతి ఉత్పత్తికి నాణ్యతా నిర్ధారణ పరీక్ష చేస్తారు. వాటిలో సఫలమైతేనే తయారీ, అమ్మకాలకు అనుమతి లభిస్తుంది.
అనుమతి తీసుకోవాలి
సవరించిన ఎరువుల నియంత్రణ చట్టానికి అనుగుణంగా బయోఉత్పత్తుల తయారీ, పంపిణీ, అమ్మకందారులంతా అనుమతులు తీసుకోవాలి. ఈ విషయమై సంబంధిత సంస్థలకు లేఖలు రాశాం. జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులకూ ఆదేశాలనిచ్చాం. అతిక్రమించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కొత్త విధానంతో రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించే వీలుంటుంది.
- హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ
ఇదీ చదవండి: