ప్రముఖ పాత్రికేేయుడు తుర్లపాటి కుటుంబరావు మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబరావు ఆత్మకు శాంతి కలగాలని వెంకయ్యనాయుడు ప్రార్థించారు.
గవర్నర్ సంతాపం..
తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు జర్నలిజం, సాహిత్యానికి చేసిన కృషికి అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నారని కొనియాడారు. కుటుంబరావు ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని గవర్నర్ ప్రార్థించారు.
తుర్లపాటి గొప్ప వక్త..
తుర్లపాటి మృతిపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుర్లపాటి సీనియర్ పాత్రికేయుడని.. మంచి రచయిత మాత్రమే కాక.. గొప్ప వక్త అని కొనియాడారు.
తుర్లపాటి సేవలు శ్లాఘనీయం
బహుముఖ ప్రజ్ఞాశాలిని రాష్ట్రం కోల్పోయిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన చెందారు. కుటుంబరావు మృతిపై ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సీనియర్ పాత్రికేయునిగా, గొప్ప వక్తగా, రచయితగా తుర్లపాటి సేవలు శ్లాఘనీయమని అన్నారు. పద్మశ్రీ, కళాప్రపూర్ణ వంటి అనేక పురస్కారాలు... తుర్లపాటి ప్రతిభకు తార్కాణాలని కొనియాడారు.
కుటుంబరావు మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన మృతి తెలుగు పాత్రికేయ, సాహితీ రంగాలకు తీరని లోటని కొనియాడారు. పద్మశ్రీతో పాటు లెక్కకు మించిన పురస్కారాలు వరించినా నిరాడంబర జీవనం సాగించారని కీర్తించారు.
నిన్న రాత్రి కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు ఆదివారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. రాత్రి 10 గంటలకు అస్వస్థతకు గురవగా.. ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పన్నెండున్నర గంటలకు గుండెపోటు రావటంతో తుర్లపాటి కన్నుమూశారు. కుటుంబరావు పాత్రికేయంతో పాటు లిటరేచర్, ఆర్ట్స్ విద్యనభ్యసించారు. తన 14వ ఏట జర్నలిజం వృత్తిలోకి అడుగుపెట్టి తనదైన ముద్రవేశారు. 'ఉపన్యాస కేసరి' వంటి అవార్డులతో పాటు 2002లో ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
ఇదీ చదవండి: