గడచిన కొన్ని నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ అద్దెబస్సులు ఎట్టకేలకు రోడ్డెక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 2900 పైగా ఆర్టీసీ అద్దె బస్సులు ఇవాల్టి నుంచి సేవలు అందిస్తున్నాయి. పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోవడంతో అద్దె బస్సులకు ఆర్టీసీ అనుమతించింది. కృష్ణాజిల్లాలో 280కి పైగా అద్దె బస్సులు తిరుగుతున్నాయి. నెలల తర్వాత అద్దె బస్సులు రోడ్డెక్కుతుండడంతో పూర్తి ఫిట్ నెస్ పరీక్షలు చేసిన తర్వాతే అధికారులు ప్రయాణికులను ఎక్కించుకునేందుకు అనుమతిస్తున్నారు.
యానాంలో ఈ రోజే..
రాష్ట్రమంతటా గత నెల 16వ తేదీనే పాఠశాలలు ప్రారంభమవగా.. తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మాత్రం నేటి నుంచి బడులు తెరుచుకున్నాయి. యానంలో 25 ప్రాథమిక పాఠశాలలు..15 ఉన్నత పాఠశాలల్లో సుమారు 8 వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ ముద్రించిన పాఠ్యాంశాలు ద్వారా విద్యను కొనసాగిస్తుంటారు. ఉపాధ్యాయుల శిక్షణ ...సెలవులు.. అంతా ఆంధ్రప్రదేశ్ విధానాలనే అనుసరిస్తుంటారు. పుదుచ్చేరి విద్యాశాఖ ... అమరావతి విద్యాశాఖ సమన్వయంతో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఫలితాల వెల్లడించడం జరుగుతుంది. కరోనా ప్రభావంతో గత ఏడాది విద్యా సంవత్సరం అసంపూర్తిగా ముగింపుకావడం.. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. ఆంధ్ర ప్రదేశ్ గత నెల 16వ తేదీ నుండి బడులు తెరిచినా పుదుచ్చేరిలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో పాఠశాల తెరిచేందుకు ఇప్పటివరకు అనుమతి ఇవ్వలేదు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించ వలసిందిగా విద్యా శాఖ నుంచి ఆదేశాలు రావడంతో ఉపాధ్యాయులు తరగతి గదులలో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేసి పాఠశాలలకు పచ్చని తోరణాలు కట్టి ముస్తాబు చేశారు. విద్యార్థులకు థర్మల్ స్కానింగ్ చేసిన అనంతరం తరగతి గదులకు అనుమతించారు. తరగతులు జరుగుతున్న తీరును యానం డిప్యూటీ కలెక్టర్ అమన్ శర్మ .. విద్యాశాఖ అధికారి పరిశీలించారు.
ఇదీ చదవండి: 'అడుగుకో గుంత.. గజానికో గొయ్యి.. ఇదీ వైకాపా పాలనలో రహదారుల దుస్థితి'