భారతీయ జనతా పార్టీ అగ్రనేతలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. కొడాలి నాని వ్యాఖ్యలను భాజపా ఖండించింది. కొడాలి వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు జీవీఎల్, మాధవ్, విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు.
మంత్రి అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రధాని మోదీ, యూపీ సీఎంం యోగి ఆదిత్య జీవితాల గురించి నానికి ఏం తెలుసని ప్రశ్నించారు. ఇతర వ్యక్తిగత జీవితాల్లో కలగజేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. హిందూ దేవాలయాలపై మంత్రి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటివరకు డిమాండ్ చేశామన్నారు. కానీ ఇవాళ్టీ వ్యాఖ్యలతో కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చారు. హిందువుల మనోభావాలను మరింత రెచ్చగొట్టేందుకే మంత్రి నాని తిరుమల పర్యటనకు వెళ్లారన్నారు.
సీఎం ప్రవర్తనపై అనుమానాలు
'కొడాలి నానిని తొలగించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. అక్రమంగా అరెస్టు చేసిన హిందూవాదులపై కేసులు ఎత్తివేయాలి. సీఎం చర్యలు తీసుకోవట్లేదంటే ఆయనపై అనుమానాలు కలుగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఖండించకపోగా అవహేళనతో మాట్లాడుతున్నారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించేవరకు పోరాటం కొనసాగిస్తాం.'---మాధవ్, భాజపా ఎమ్మెల్సీ
మంత్రి పదవి నుంచి తొలగించాలి
ప్రధాని మోదీ, యూపీ సీఎంపై కొడాలి నాని వ్యాఖ్యలను భాజపా ఎంపీ జీవీఎల్ ఖండించారు. మోదీ, ఆదిత్యనాథ్ ఆచరణ, నిబద్ధత తెలిసీ వ్యాఖ్యలు చేయడాన్ని జీవీఎల్ తప్పుబట్టారు. కొడాలి నానిని వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
కొడాలిపై క్రిమినల్ కేసు పెట్టాలి
మంత్రి వెల్లంపల్లి తన ఇంటి వద్ద ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేయలేకపోయారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి ఆరోపించారు. తితిదేకు చెందిన రూ.5 వేల కోట్లు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే డీజీపీ కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కొడాలి నానిపై 24 గంటల్లో క్రిమినల్ కేసు నమోదు చేయాలని విష్ణువర్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'రాష్ట్ర సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన'