రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 56 బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పదవుల ప్రకటన వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం జాబితాను ప్రకటిస్తారని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా కార్యక్రమాన్ని వాయిదా వేసింది. కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి పదవుల కేటాయింపుల్లో చివరి నిమిషంలో మార్పులు చేయాల్సి రావడమే వాయిదాకు కారణంగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వారం రోజుల్లో 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అక్టోబర్ 7 లేదా 8 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.
బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వారి కోసం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ సీఎం జగన్ అమలు చేశారని బొత్స అన్నారు. బీసీల్లోని అన్ని కులాలకు కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దీని ప్రకారం అధ్యయనం జరిపి 30 వేల పైన జనాభా ఉన్న బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లకు సగభాగం మహిళలు ఛైర్మన్లుగా ఉంటారన్నారు. వైఎస్సార్ జలకళ తాము పెట్టిందేనని తెదేపా నేతలు అసత్యాలు చెబుతున్నారని బొత్స ఆరోపించారు. బీసీలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు భావించారని, ఆదరణ పథకం పెట్టి బలహీన వర్గాల డబ్బును దోపిడీ చేశారని విమర్శించారు.
ఇవీ చదవండి..