ఆర్థిక శాఖలో నిధుల దుర్వినియోగంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమాధానం చెప్పాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పద్దులంటే సీఎం జగన్, విజయసాయి రెడ్డి సొంత లెక్కలు కావని ధ్వజమెత్తారు. దొంగ లెక్కల్లో ఆరితేరిన వీరిద్దరూ ఆర్థిక వ్యవహారాల విషయంలో కేంద్రానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆక్షేపించారు. ఆ కుట్రలో భాగంగానే 10వేల బిల్లులను ఖజానా ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో ఆమోదింపజేసుకున్నారని ఆరోపించారు.
"ప్రభుత్వం చేసే ఖర్చు పారదర్శకంగా ఉంటే.. దొడ్డిదారిన చెల్లింపులు చేయాల్సిన పనిలేదు. ముందు వచ్చిన బిల్లుల్ని వరుస క్రమంలో చెల్లించాలనే సీఎఫ్ఎంఎస్ విధానానికి విరుద్ధంగా 10వేల బిల్లుల్ని అడ్డగోలుగా చెల్లించిన తీరుపై సమాధానం ఆర్థిక మంత్రి సమాధానం చెప్పి తీరాలి. పీఏసీ ఛైర్మన్‌గా తెదేపా ప్రభుత్వంపై గగ్గోలు పెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పుడు లెక్కల్లో చూపని రూ.41వేల కోట్ల ఆర్థికశాఖ(AP Ministry of Finance )లో నిధుల దుర్వినియోగంపై ఎందుకు మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వాన్ని కాగ్ వివరణ అడిగి 2నెలలైనా ఇంతవరకూ ఎందుకు స్పందించలేదు. ఐఏఎస్ అధికారి కాని వారి చేతిలో ఆర్థిక శాఖను పెట్టి చెల్లింపుల్లో గోప్యత పాటిస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. సీఎం కార్యాలయం ఆదేశాలకు అనుగుణంగా సీఎఫ్ఎంఎస్ నిబంధనలు కాదని రహస్యంగా చెల్లింపులు చేయటాన్ని అవినీతిగా ఎందుకు భావించకూడదు. జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఏం కాదులే అనుకునే అధికారులు భవిష్యత్తులో శిక్ష అనుభవించక తప్పదు. గిరిజా శంకర్‌తో పాటు పలువురు అఖిల భారత సర్వీస్ అధికారుల తీరుపై డీఓపీటీకి ఫిర్యాదు చేయనున్నాం. ప్రజాపద్దుల కమిటీకి జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత అధికారులదే. చట్ట సభల్లో వాస్తవాలు బయటపెట్టించేదాక ప్రభుత్వాన్ని వదిలిపెట్టం" అని హెచ్చరించారు.
ఇదీ చదవండి: JAGAN PLAYED CRICKET: సీఎం జగన్ బ్యాటింగ్..ఎంపీ అవినాష్ బౌలింగ్