తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని.. తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘానికి తమ అభ్యంతరాలు వ్యక్తపరిచామని.., అయినా వాటిని పరిగణలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరించడం విచారకరమన్నారు.
తక్కువ కరోనా కేసులు నమోదువుతున్నపుడు వాయిదా వేసి.. కేసులు ఎక్కువ నమోదవుతున్న సమయంలో ఎలా నిర్వహిస్తారని ఎస్ఈసీని ప్రశ్నించారు. ఉద్యోగుల్లో కరోనా భయాందోళనలు ఇంకా వీడలేదని.., మరోపక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఇప్పటికే ఉద్యోగులు వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారని ఇటువంటి సమయంలో ఎన్నికల నిర్వహణకు తొందరెందుకని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లి తమ అభ్యంతరాలు తెలియజేస్తామన్నారు.
ఇదీచదవండి: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్